YSRCP MLC Candidates: మూడు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన ఏపీ సీఎం జగన్, మిగిలిన 11 ఎమ్మెల్సీ స్థానాలకు రెండు, మూడు రోజుల్లో అభ్యర్థులు ఖరారు, ఇక పలుచోట్ల ఏకగ్రీవంగా మారిన జెడ్పీటీసీలు

ఖాళీ అయిన మొత్తం 14 ఎమ్మెల్సీ స్థానాలలో మిగిలిన 11 ఎమ్మెల్సీ స్థానాలకు (MLC Elections) రెండు, మూడు రోజుల్లోనే అభ్యర్థులను సీఎం ఖరారు చేస్తారని చెప్పారు.

AP CM YS Jagan | File Photo

Amaravati, Nov 11: ఏపీలో మూడు ఎమ్మెల్సీ పదవులకు అభ్యర్థులను (YSRCP MLC Candidates) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ (AP CM YS Jagan ) ఖరారు చేశారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ఖాళీ అయిన మొత్తం 14 ఎమ్మెల్సీ స్థానాలలో మిగిలిన 11 ఎమ్మెల్సీ స్థానాలకు (MLC Elections) రెండు, మూడు రోజుల్లోనే అభ్యర్థులను సీఎం ఖరారు చేస్తారని చెప్పారు.

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు శ్రీకాకుళం డీసీసీబీ మాజీ చైర్మన్‌ పాలవలస విక్రాంత్, కర్నూలు జిల్లా నంద్యాల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఇసాక్‌ బాషా, వైఎస్సార్‌ జిల్లా బద్వేలు మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డిలను సీఎం జగన్‌ ఎంపిక చేశారన్నారు.

మిగిలిన అభ్యర్థుల పేర్లను రెండు, మూడు రోజుల్లో ప్రకటిస్తామన్నారు. సామాజిక న్యాయాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ మాటల్లో కాకుండా చేతల్లో చూపుతున్నారని స్పష్టం చేశారు. ప్రసుత్తం శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ తరఫున ఉన్న 18 మంది ఎమ్మెల్సీల్లో 11 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారేనని తెలిపారు. ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికలు జరగుతున్న 3 ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక సీటును బీసీ (తూర్పు కాపు)కి, మరో సీటు మైనార్టీకి కేటాయించారని వివరించారు.

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎన్నికల సందడి, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల, తెలంగాణలో 12, ఆంధ్రప్రదేశ్‌లో 11 స్థానాలకు ఎన్నికలు

ఇక ఏకగ్రీవంగా గెలిచిన విజేతలు ప్రమాణ స్వీకారానికి ముందే చనిపోవడంతో మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్న మూడు జెడ్పీటీసీ స్థానాలు ఈసారి కూడా ఏకగ్రీవాలే అయ్యాయి. మూడింటికి మూడు చోట్లా మరోసారి వైఎస్సార్‌సీపీ అభ్యర్ధులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైఎస్సార్‌ జిల్లా లింగాల, గుంటూరు జిల్లా కారంపూడి, కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల జెడ్పీటీసీ స్థానాల్లో గతంలో ఏకగ్రీవంగా గెలిచిన వారు మరణించడంతో ఈ నెల 16న ఉప ఎన్నిక నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. మంగళవారంతో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియగా అన్ని చోట్లా అధికార పార్టీ అభ్యర్ధులే బరిలో నిలవడంతో ఆయా స్థానాలు ఏకగ్రీవమైనట్లు రిటర్నింగ్‌ అధికారులు ప్రకటించారు.

ఈ వాయుగుండం తీరం దాటగానే..ముంచుకొస్తున్న ఇంకో వాయుగుండం ముప్పు, తమిళనాడు, ఏపీలో కుండపోత వర్షాలు, 13 ఏళ్ల తర్వాత నెల్లూరుకు సమీపంలో తీరం దాటనున్న తుఫాను

చిత్తూరు జిల్లా కలకడ జెడ్పీటీసీ స్థానంలో మరణించిన టీడీపీ అభ్యర్థికి బదులుగా ఆ పార్టీ నుంచి ఎవరూ పోటీలో నిలవలేదు. అక్కడ వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి ఒక్కరే పోటీలో ఉండడంతో ఆ జెడ్పీటీసీ స్థానం ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. మిగిలిన 10 జెడ్పీటీసీ స్థానాల్లో మొత్తం 40 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 500 గ్రామ పంచాయతీల పరిధిలో 69 సర్పంచి, 533 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరగనుండగా మంగళవారం సాయంత్రానికి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. 30 సర్పంచి స్థానాల్లో ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది. మరో 4 చోట్ల ఒక్కరు కూడా నామినేషన్లు దాఖలు చేయలేదు. మిగిలిన 35 చోట్ల 109 మంది పోటీలో ఉండగా అక్కడ ఈ నెల 14వ తేదీ పోలింగ్‌ జరగనుంది. 533 వార్డు సభ్యుల పదవుల్లో 380 చోట్ల ఎన్నిక ఏకగ్రీవమైంది. మరో 85 చోట్ల ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. మిగిలిన 68 వార్డుల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా 192 మంది పోటీలో ఉన్నారు.

ఎన్నికలు ఆగిపోవడం, గెలిచిన వారు మృతి చెందడం లాంటి కారణాలతో 176 ఎంపీటీసీ స్థానాల్లో తాజాగా ఎన్నికలు నిర్వహిస్తుండగా నామినేషన్లు ఉపసంహరణ ప్రక్రియ ముగిసే సమయానికి 50 చోట్ల ఏకగ్రీవాలయ్యాయి. ఇందులో 46 చోట్ల అధికార వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవంగా గెలుచుకోగా మూడు చోట్ల టీడీపీ, ఒక చోట ఇండిపెండెంట్‌ అభ్యర్ధి ఏకగ్రీవంగా గెలుపొందారు. మరో మూడు ఎంపీటీసీ స్థానాల్లో ఒక్కరు కూడా నామినేషన్‌ దాఖలు చేయలేదు. మిగిలిన 123 చోట్ల ఎన్నికలు జరగనుండగా 328 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగేచోట ఈ నెల 16వ తేదీన పోలింగ్‌ జరగనుంది.