Tamil Nadu Rains: ఈ వాయుగుండం తీరం దాటగానే..ముంచుకొస్తున్న ఇంకో వాయుగుండం ముప్పు, తమిళనాడు, ఏపీలో కుండపోత వర్షాలు, 13 ఏళ్ల తర్వాత నెల్లూరుకు సమీపంలో తీరం దాటనున్న తుఫాను
Representational Image (Photo Credits: PTI)

Chennai, Nov 11: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 430 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 420 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ అల్పపీడనం గురువారం ఉదయం మరింత బలపడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది.

అనంతరం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి గురువారం సాయంత్రం తమిళనాడులోని కారైకల్, ఏపీలోని శ్రీహరికోట మధ్య కడలూరు సమీపంలో తుపానుగా తీరం దాటే అవకాశం (Depression to cross Tamil Nadu-Andhra Pradesh coast) ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం నాటికి ఇది బలహీనపడి వాయుగుండంగా మారి అనంతపురం జిల్లా, కర్ణాటక రాష్ట్రాల మీదుగా అరేబియా సముద్రం వైపు ప్రయాణిస్తుందని అంచనా వేస్తున్నారు. 13 ఏళ్ల తర్వాత నెల్లూరుకు సమీపంలో తుపాను తీరం దాటనుంది. అంతకు ముందు 2008 నవంబర్‌ 13న నెల్లూరు వద్ద తుపాను తీరాన్ని దాటింది.

ఆ సమయంలో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ(భారత వాతావరణశాఖ) తెలిపింది. దీని ప్రభావంతో బుధవారం ఉత్తర తమిళనాడులో ఎడతెరపిలేకుండా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల వర్షాలు (Heavy rainfall forecast) కురిశాయి. గురువారం నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ నుంచి అతిభారీగా, అక్కడక్కడ అసాధారణంగా, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీగా, కృష్ణా నుంచి విశాఖ జిల్లా వరకు, కర్నూలులో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. కాగా, రానున్న 48గంటల రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నెల్లూరు. చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంది.

దూసుకొస్తున్న మరో సైక్లోన్ ముప్పు, తమిళనాడు వ్యాప్తంగా రెడ్ అలర్ట్, ఏపీని ముంచెత్తనున్న భారీ వర్షాలు, చెన్నైలో రెండు రోజుల పాటు కుండపోత వర్షాలు

వాయుగుండం తీరం దిశగా వచ్చే క్రమంలో కుండపోత వర్షాలతో (Tamil Nadu rains) లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమవుతాయని, నగరాలు, పట్ణణాల్లో వంతెనలు, అండర్‌పా్‌సలలో భారీగా నీరు చేరే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. గురువారం ఉదయం నుంచే వెలుతురు బాగా తగ్గుతుందని, వాహన చోదకులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కొండ చరియలు, మట్టిపెళ్లలు విరిగిపడే అవకాశం ఉందని పేర్కొంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని, బలహీనంగా ఉన్న ఇళ్ల నుంచి సురక్షిత భవనాలకు వెళ్లాలని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం సూచించింది. వ్యవసాయ, ఉద్యానవన పంటలు దెబ్బతింటాయని పేర్కొంది.

బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారినందున మత్స్యకారులు రెండు రోజులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. కాగా, గురువారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారుతుందని ఇస్రో వాతావరణ శాఖ నిపుణుడొకరు తెలిపారు. ఇదిలావుండగా ఈనెల 13వ తేదీకల్లా దక్షిణ అండమాన్‌ సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడి, ఆ తరువాత 48 గంటల్లో మరింత బలపడి తమిళనాడు తీరం దిశగా రానుందని వాతావరణ శాఖ తెలిపింది.

మరో మూడు రోజులు కుండపోత వర్షాలు, చెన్నైకి రెడ్‌ అలెర్ట్‌, ఏపీలో నీట మునిగిన నెల్లూరు, చిత్తూరు జిల్లాలు, బంగాళాఖాతంలో ఈ నెల 9న అల్పపీడనం, కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం

కాగా, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో బుధవారం ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల కుండపోతగా వానపడుతోంది. జిల్లాలోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. ప్రతి మండలంలో కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు ఆదేశించారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అతిభారీ వర్షాలు, వైఎస్సార్‌ కడప, చిత్తూరు, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో ఒకటిరెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. శుక్రవారం నెల్లూరు, ప్రకాశం, వైఎస్సార్‌ కడప, చిత్తూరు జిల్లాల్లో ఒకటిరెండు చోట్ల అతితీవ్రమైన భారీవర్షాలు, గుంటూరు, అనంతపురం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి.

విశాఖ, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు ఒకటో నంబర్‌ ప్రమాద హెచ్చరిక, కళింగపట్నం, భీమునిపట్నం, వాడరేవుల్లో అప్రమత్తత హెచ్చరికలు జారీచేశారు. వాయుగుండం ప్రభావంతో రెండురోజులు తీరం అల్లకల్లోలంగా ఉండనుంది. గంటకు 45 నుంచి 55 కిలోమీటర్లు.. గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. వాతావరణ శాఖ హెచ్చరించింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ కమిషనర్‌ కన్నబాబు కోరారు.

2015 తర్వాత మళ్లీ నీట మునిగిన చెన్నై, మరో మూడు రోజులు తప్పని పెనుముప్పు, తమిళనాడుకు అండగా ఉంటామని తెలిపిన కేంద్రం, సహాయక చర్యలను ముమ్మరం చేసిన స్టాలిన్ సర్కారు

ఈ నెల 13న మరో అల్పపీడనం

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కూడా రూపుదిద్దుకుంటోందని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు ప్రకటించారు. ఈ నెల 13న అండమాన్‌ సమీపంలో ఏర్పడే అల్పపీడనం కూడా వాయుగుండంగా మారే అవకాశం వుందని వారు పేర్కొన్నారు. దీనితో రెండు వాయుగుండాలు వరుసగా విరుచుకుపడి వర్షబీభత్సాన్ని సృష్టించనున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో మంగళవారం ఉదయం కేంద్రీకృతమైన అల్పపీడనం బుధవారం వాయుగుండంగా మారినట్టు స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం 8.30 గంటలకు ఆ వాయుగుండం దక్షిణ బంగాళాఖాతం నడుమ కేంద్రీకృతమైనట్టు వారు పేర్కొన్నారు.

బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత కొన్నిరోజులుగా ఈశాన్య రుతుపవనాలు, అల్పపీడన పరిస్థితుల కారణంగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని చెన్నైలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ నెల 6న కురిసిన రికార్డు స్థాయి వర్షంలో చెన్న నీట మునిగింది. ఆ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నీటి తొలగింపు కార్యక్రమాలు పూర్తికాకముందే మరోసారి నగరాన్ని భారీ వర్షాలు పలకరించాయి. పలు జిల్లాల్లోనూ వరుణుడు బెంబెలేత్తిస్తున్నాడు. ఈ నేపథ్యంలో చెన్నై నగరంలోనూ, 12 జిల్లాల్లోనూ రెడ్ అలర్ట్ ప్రకటించారు.

వాతావరణ శాఖ చెన్నై నగరంతో పాటు కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు, విల్లుపురం, తేన్ కాశీ, కన్యాకుమారి, మధురై, శివగంగై, పుదుకోట్టై, తిరునల్వేలి, తిరువారూరు, రామనాథపురం జిల్లాలకు అతి భారీ వర్ష సూచన జారీ చేసింది. 12 జిల్లాల్లో నేడు, రేపు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. చెన్నై నగరంలో కుండపోత వర్షానికి 8 సబ్ వేలు మునిగిపోయాయి. నగరంలో సహాయక చర్యల నిమిత్తం మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు కావేరి, వైగై, తేన్ పెన్నై, భవానీ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

వాయుగుండం కారణంగా చెన్నై, విల్లుపురం, కడలూరు, శివగంగ, రామనాథపురం జిల్లాల్లో కారైక్కాల్‌ ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం నుంచి వర్షాలు కురిశాయి. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురం, తిరువణ్ణామలై జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ఈ జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. నాగపట్టినం, మైలాడుదురై, తిరువారూరు, తంజావూరు, కడలూరు, విల్లుపురం, పుదుకోట, శివగంగ, రామనాథపురం, పుదుచ్చేరి, కారైక్కాల్‌ ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం నుంచి వర్షాలు కురిశాయి. వాయుగుండం తీరం దాటే సమయంలో చెన్నైతోపాటు తిరునల్వేలి, తూత్తుకుడి, కన్నియా కుమారి, తెన్‌కాశి, విరుదునగర్‌, మదురై, అరియలూరు, పెరంబలూరు, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో భారీగా వర్షాలు కురవనున్నాయి.

నీలగిరి, కోయంబత్తూరు, ఈరోడ్‌, సేలం, వేలూరు, రాణిపేట, తిరుపత్తూరు, తిరువణ్ణామలై, కళ్లకుర్చి జిల్లాల్లో చెదురుముదురుగా వర్షాలు కురుస్తాయి. అరియలూరు, పెరంబలూరు, తిరుచ్చి, రామనాథపురం, పుదుకోట తదితర డెల్టా జిల్లాల్లో మూడు రోజులపాటు భారీగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. చెన్నై పరిసర ప్రాంతాల్లోనూ శనివారం వరకు భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 5100 శిబిరాలలో వర్షబాధితులు బసచేస్తున్నారు.కాగా చెన్నైలో బుధవారం రాత్రి వరకు వర్షం కురుస్తూనే ఉంది.