IMD Alerts: మరో మూడు రోజులు కుండపోత వర్షాలు, చెన్నైకి రెడ్‌ అలెర్ట్‌, ఏపీలో నీట మునిగిన నెల్లూరు, చిత్తూరు జిల్లాలు, బంగాళాఖాతంలో ఈ నెల 9న అల్పపీడనం, కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
chennai rains (Photo-ANI)

Chennai, Nov 8: బంగాళాఖాతంలో ఈ నెల 9న ఏర్పడనున్న అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం కొనసాగింపు తదితర కారణాల వల్ల ఈ నెల 10, 11 తేదీల్లో తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy rainfall expected next 3 days) కురుస్తాయని వాతావరణశాఖ (IMD) ప్రకటించింది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం తదితర సముద్రతీర జిల్లాల్లో ఆ రెండు రోజులపాటు కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. చెన్నైకి రెడ్‌ అలెర్ట్‌ (Chennai Red Alert) ప్రకటించింది. చెన్నైకి నీరందించే జలాశయాలైన పూండి, సెంబరంబాక్కం, పుళల్‌ల నుంచి ముంపు ముప్పు ఉందని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రానున్న 48 గంటల్లో తమిళనాడులోని (Tamil Nadu Rains) పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.ఆదివారం ఉదయం నుంచి 44 పునరావాస కేంద్రాల్లో 50 వేల ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశామని సీఎం చెప్పారు.రానున్న మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నందున ప్రజలు తమ ప్రయాణ ప్రణాళికలను రద్దు చేసుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

2015 తర్వాత మళ్లీ నీట మునిగిన చెన్నై, మరో మూడు రోజులు తప్పని పెనుముప్పు, తమిళనాడుకు అండగా ఉంటామని తెలిపిన కేంద్రం, సహాయక చర్యలను ముమ్మరం చేసిన స్టాలిన్ సర్కారు

అధికారులను అప్రమత్తం చేశామని రాష్ట్ర ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పని చేస్తున్నాయన్నారు.నగరంలో వర్షాలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించడానికి 24 గంటల టోల్ ఫ్రీ నంబర్ - 1070 ఏర్పాటు చేశారు. ఈశాన్య రుతుపవనాల ప్రారంభంతో అక్టోబర్ 1 నుంచి నవంబర్ 7 వరకు రాష్ట్రంలో 334.64 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని, ఇది ఈ సీజన్‌లో సాధారణ వర్షపాతం కంటే 44 శాతం ఎక్కువ అని సీఎం స్టాలిన్ చెప్పారు.

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో దక్షిణకోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అనేక చోట్ల భారీ వర్షాలు మొదలయ్యాయి. ఆదివారం చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో రోజంతా ఎడతెరపి లేకుండా వర్షాలు కురిశాయి. తిరుమలలో శనివారం మధ్యాహ్నం మొదలైన వర్షం ఆదివారం రాత్రి వరకూ కురుస్తూనే ఉంది. పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతం దగ్గరలో దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు కోస్తా ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉంది. అలాగే ఆగ్నేయ బంగాళాఖాతం దగ్గరలో మరో ఉపరితల ఆవర్తనం వ్యాపించింది.వీటి ప్రభావంతో రానున్న నాలుగు రోజులు దక్షిణకోస్తా, రాయలసీమలలో వానలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

దేశంలో కొత్త‌గా 11,451 క‌రోనా కేసులు, నిన్న క‌రోనాతో 266 మంది మృతి, ప్రస్తుతం 1,42,826 యాక్టివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. చిత్తూరు, నెల్లూరు జిల్లాలోని పడమటి మండలాల్లో దాదాపు చెరువులన్నీ నిండిపోగా.. తూర్పు మండలాల్లో 75 శాతం చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. వీటిలో 25 శాతం చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. చిత్తూరు, తిరుపతిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తుండడంతో కలెక్టర్‌ హరినారాయణన్‌ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.

చిత్తూరు జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కేవీబీపురం మండలం బ్రాహ్మణపల్లి – కాళంగి మధ్య కాలువ గట్టు కొట్టుకుపోవడంతో 8 గ్రామాలకు రాకపోకలు బంద్‌ అయ్యాయి. పిచ్చాటూరు మండలం ఆరణీయార్‌ రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో గేట్లు ఎత్తి 1,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. కేవీబీ పురం మండల పరిధిలోని కాళంగి రిజర్వాయర్‌కు అంచనాకు మించి భారీగా వరద నీరు చేరడంతో 10 గేట్లు ఎత్తి నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేశారు.

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నెల్లూరులో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి నుంచి నెల్లూరులో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. అండర్‌ బ్రిడ్జిల కింద భారీగా నీరు నిలిచిపోయింది. అటు.. ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. సూళ్లూరుపేటలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బాలయోగి గురుకుల పాఠశాల, జూనియర్‌ కళాశాల ప్రాంగణం జలమయమైంది. విద్యాలయంలోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతోంది.

తిరుమలలోని గోగర్భం, పాప వినాశనం డ్యాంలు పూర్తి స్థాయిలో నిండటంతో నీటిని కిందికి విడిచిపెట్టారు. ఆకాశగంగ, కుమారధార ప్రాజెక్టులు కూడా నిండాయి. తద్వారా ఏడాది పాటు తిరుమలకు నీటి కష్టాలు ఉండవు. శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని మల్లిమడుగు, సదాశికోన రిజర్వాయర్‌కు వరద నీరు చేరుతోంది. చంద్రగిరి పరిధిలోని కళ్యాణీ డ్యాం పూర్తి స్థాయిలో నిండేందుకు మరో 11 అడుగులు మాత్రమే మిగిలి ఉంది. నిమ్మనపల్లి పరిధిలోని బహుదా ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నీరు చేరింది. పలమనేరు పరిధిలోని కౌడిన్య, కైగల్, ఎరిగేరి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. కాలువపల్లి సమీపంలోని వైఎస్సార్‌ జలాశయం పూర్తిగా నిండింది.