Tamil Nadu Rains: 2015 తర్వాత మళ్లీ నీట మునిగిన చెన్నై, మరో మూడు రోజులు తప్పని పెనుముప్పు, తమిళనాడుకు అండగా ఉంటామని తెలిపిన కేంద్రం, సహాయక చర్యలను ముమ్మరం చేసిన స్టాలిన్ సర్కారు
PM Narendra Modi and MK Stalin (Photo Credits: PTI)

Chennai, Nov 8: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం, ఈశాన్య రుతువవనాలు నిర్ణీత సమయానికి ముందే రాష్ట్రంలోకి ప్రవేశించడం వంటి కారణాలతో కురిసిన భారీ వర్షానికి (Tamil Nadu Rains) చెన్నై నీట మునిగింది. నదులు, వాగులు.. వంకలు పొంగి పొర్లుతున్నాయి. 50కి పైగా జలాశయాలు, వందలాది చెరువుల నుంచి వరద నీటిని విడుదల చేశారు. నగరం చుట్టుపక్కల ఉన్న చెరువులన్నీ ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి.

చైన్నై జలమయమైన నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కే.స్టాలిన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఫోన్‌ (PM Narendra Modi Speaks to CM MK Stalin) చేసి మాట్లాడారు. సహాయ, పునరావాస చర్యల్లో తమిళనాడుకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మోదీ ట్విటర్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.

శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి (Heavy Rains) నగరంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. చెన్నైకి తాగునీరు అందించే చెంబరం బాక్కం, పూండి, పుళల్‌ రిజర్వాయర్ల నుంచి వరద నీటి విడుదలతో రవాణా సౌకర్యాలు స్తంభించాయి. రైళ్ల రాకపోకలపైనా ప్రభావం పడింది. విమానాలు ఆలస్యంగా నడిచాయి. ఉత్తర, దక్షిణ చెన్నై పరిధిలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

స్టాలిన్ మార్క్ మొదలైంది..నన్ను ఎవరైనా పొగిడితే వారిపై చర్యలు తప్పవని తెలిపిన తమిళనాడు సీఎం, రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని ఎమ్మెల్యేలకు సూచన

చెన్నైలోని సబర్బన్‌ ప్రాంతాల్లో ఆదివారం ఉదయం వరకు 23 సెం.మీ వర్షం కురవడంతో నగరంలో రహదారులు చెరువులుగా మారాయి. దీంతో పలు ప్రాంతాల్లో రవాణా నిలిచిపోయింది. చెన్నైలోని పాడి, పురసవల్కం, కొలత్తూరు ప్రాంతాల్లో భారీగా వరదనీరు చేరింది. మదురై, కడలూరు జిల్లాల్లో అత్యవసర సేవల కోసం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) నాలుగు బృందాలను మోహరించినట్లు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు.

చెన్నై సెంట్రల్‌ స్టేషన్‌లోకి వరద నీరు చేరడంతో అక్కడి నుంచి సుదూర ప్రాంతాలకువెళ్లాల్సిన రైళ్లను పెరంబూర్‌, తిరువొత్తియూరు, బీచ్‌, ఆవడి, తిరువళ్లూరు తదితర స్టేషన్ల నుంచి పంపించారు. వివిధ ప్రాంతాల నుంచి చెన్నై రావాల్సిన మరికొన్ని రైళ్లను శివారు ప్రాంతాల్లోనే నిలిపేసి, అక్కడి నుంచి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టారు. కాగా భూగర్భంలో ఉన్న కొన్ని మెట్రోరైల్‌ స్టేషన్లలోకి వరదనీరు చేరింది. నీటిని తోడేందుకు ప్రత్యేక మోటార్లు ఏర్పాటు చేశారు.

సీఎం స్టాలిన్ మరో సంచలన నిర్ణయం, ఇకపై ప్రజల వాహనాలతోనే సీఎం కాన్వాయ్, ట్రాఫిక్ ఇబ్బందుల నేపథ్యంలో తన కాన్వాయ్ వాహనాలు సగానికి తగ్గించిన తమిళనాడు ముఖ్యమంత్రి

2015లో కురిసిన వర్షంతో నగరం నీట మునిగిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అంతకు మించిన వర్షపాతం నమోదైంది. శనివారం మధ్యాహ్నం 12 నుంచి ఆదివారం 12 గంటల వరకు నగరంలో 23 సెం.మీల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. దీంతో నగరంలోని అత్యధిక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎటుచూసినా వీధులు చెరువుల్లా దర్శనమిచ్చాయి. అనేక సబ్‌వేలు నిండిపోయాయి. ప్రభుత్వం హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేసి యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలకు దిగింది.

పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న తమిళనాడు ప్రభుత్వం.. వరద ముప్పు ఉందన్న హెచ్చరికలు జారీ చేసి, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని ప్రత్యేక శిబిరాలకు తరలిస్తోంది. ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ఇరాయి అంబు, ఇతర అధికారులతో కలిసి వరద ప్రాంతాలకు వెళ్లి స్వయంగా పరిస్థితుల్ని సమీక్షించారు. ప్రజలెవరూ ఇబ్బందులు పడకుండా సహాయ కార్యక్రమాలు అందించాలంటూ అధికారుల్ని ఆదేశించారు.

స్టాలిన్‌ విజ్ఞప్తి మేరకు నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) కూడా రంగంలోకి దిగి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. చెన్నైతో పాటు తిరువళ్లూర్, చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాల్లో వచ్చే రెండు రోజుల పాటు పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. తుపాన్ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంకు అనుమతించారు.

బంగాళాఖాతంలో ఈ నెల 9న ఏర్పడనున్న అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం కొనసాగింపు తదితర కారణాల వల్ల ఈ నెల 10, 11 తేదీల్లో తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం తదితర సముద్రతీర జిల్లాల్లో ఆ రెండు రోజులపాటు కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. చెన్నైకి రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించింది. చెన్నైకి నీరందించే జలాశయాలైన పూండి, సెంబరంబాక్కం, పుళల్‌ల నుంచి ముంపు ముప్పు ఉందని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సీఎం సార్ కాపాడండి అంటూ వీడియో ద్వారా వేడుకున్న బాలిక, నేను ఉన్నానంటూ ఆ చిన్నారికి భరోసా ఇచ్చిన తమిళనాడు సీఎం స్టాలిన్

నగరంలో వర్షాలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించడానికి 24 గంటల టోల్ ఫ్రీ నంబర్ - 1070 ఏర్పాటు చేశారు. ఈశాన్య రుతుపవనాల ప్రారంభంతో అక్టోబర్ 1 నుంచి నవంబర్ 7 వరకు రాష్ట్రంలో 334.64 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని, ఇది ఈ సీజన్‌లో సాధారణ వర్షపాతం కంటే 44 శాతం ఎక్కువ అని సీఎం స్టాలిన్ చెప్పారు.