Chennai, August 29: తమిళనాడు సీఎంగా డీఎంకే అధినేత ఎంకె స్టాలిన్ సరికొత్త నిర్ణయాలతో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నారు. స్టాలిన్ సీఎం (Tamil Nadu Chief Minister MK Stalin) అయిన తరువాత...గత ప్రభుత్వ నిర్ణయాల అమల్లో బేషజాలకు పోవటం లేదు. తన తండ్రి రాజకీయ ప్రత్యర్ధి అమ్మ పేరుతో కొనసాగుతన్న వాటిని రద్దు చేయటం లేదు. జయలలిత ప్రారంభించిన అమ్మ క్యాంటీన్లను యధావిధిగా కొనసాగించాలని స్టాలిన్ నిర్ణయించారు.
అంతే కాకుండా.. కరోనా విషయంలో వేసిన టాస్క్ ఫోర్స్ కమిటీలోనూ ప్రత్యర్ధి పార్టీల సభ్యులకు అవకాశం ఇచ్చారు. తన ప్రమాణ స్వీకార సమయంలో అన్నా డీఏంకే నేతలు పన్నీర్ సెల్వం..పళిని స్వామిలను తన టేబుల్ వద్దే కూర్చోబెట్టుకున్న ఫొటోలు స్టాలిన్ పరిణితిని స్పష్టం చేసాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు ఉన్నత విద్యా సంస్థల్లో రిజర్వేషన్ కల్పించారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్ధులకు మేలు చేసే నిర్ణయంగా ప్రశంసలు అందుకుంది.అయితే తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.
సభా సమయంలో తనపై అభినందనలు కురిపిస్తున్న డీఎంకే పార్టీ నేతలకు సున్నితంగా వార్నింగ్ (CM Stalin warns DMK MLAs) ఇచ్చారు.శనివారం తమిళనాడు అసెంబీలో.. సీఎం స్టాలిన్, దివంగత అగ్రనేతలు అన్నాదురై, కరుణానిధిని కీర్తిస్తూ కడలూరు నియోజకవర్గ డీఎంకే ఎమ్మెల్యే అయ్యప్పన్ సుదీర్ఘంగా ప్రసంగించారు. సుమారు ఐదు నిమిషాలకు పైగా స్టాలిన్‌ను పొగిడారు. ఇందుకు సీఎం స్టాలిన్ అభ్యంతరం పలుకుతూ.. నా గురించి పొగడ్తల ప్రసంగాలు వద్దని శుక్రవారమే చెప్పాను, అయినా సభ్యులు మానుకోలేదు, ఎమ్మెల్యేలు అనవసర ప్రసంగాలు మాని, బడ్జెట్, సమస్యలపై చర్చించి రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. అంతేకాదు.. సభా సమయాన్ని వృథా చేస్తే చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు.