CM Jagan Kuppam Tour: సీఎం జగన్ ఈ నెల 23న కుప్పం పర్యటన, టీడీపీ గుండెల్లో పరిగెడుతున్న రైళ్లు, మూడో విడత వైఎస్సార్ చేయూత నిధులు విడుదల చేయనున్న ఏపీ ముఖ్యమంత్రి
కుప్పంలో వైఎస్సార్ చేయూత పథకం లబ్ధిదారులకు మూడో విడత నిధులను సీఎం విడుదల చేయనున్నారు. అలాగే అక్కడ జరిగే బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగించనున్నారు.
Kuppam, Sep 21: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 23న చిత్తూరు జిల్లా కుప్పంలో (AP CM YS Jagan Kuppam Tour) పర్యటించనున్నారు. కుప్పంలో వైఎస్సార్ చేయూత పథకం లబ్ధిదారులకు మూడో విడత నిధులను సీఎం విడుదల చేయనున్నారు. అలాగే అక్కడ జరిగే బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగించనున్నారు. వాస్తవానికి ఈ నెల 22నే కుప్పం పర్యటనకు వెళ్లాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల 23కి వాయిదా పడింది. కాగా కుప్పంలో వైసీపీ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. 175కి 175 సీట్లు కుప్పం నుంచే మొదలుపెడతామంటూ అక్కడ గోడల మీద బ్యానర్లు ఈ మధ్య వైరల్ అయిన సంగతి విదితమే.
కుప్పంలో మనమెందుకు చంద్రబాబును ఓడించలేమనే నినాదాన్ని జగన్ బలంగా వినిపిస్తున్నారు. బాబును ఓడించడం అసాధ్యం ఎందుకు అవుతుందనే ప్రశ్నతో చంద్రబాబు, టీడీపీ నేతలతో జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నారు. జగన్ ఆశయానికి తోడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు మిథున్‌రెడ్డి తోడయ్యారు. దేనిలోనూ వెనుకంజ వేసే స్వభావం కాదు. బాబును ఓడించడానికి కుప్పంలో దేనికైనా రెడీ అనే లెవెల్‌లో వైసీపీ గట్టి పట్టుదలతో ముందుకెళుతోంది.
సీఎం జగన్ పర్యటన షెడ్యూల్..
► ఈ నెల 23 ఉదయం 9.15 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి కుప్పం బయలుదేరతారు.
► 10.45 గంటలకు కుప్పం చేరుకుంటారు.
► 11.15–12.45 గంటల మధ్య బహిరంగ సభలో పాల్గొంటారు
► అనంతరం వైఎస్సార్ చేయూత పథకం మూడో విడత నిధులను విడుదల చేస్తారు.
► 1.20 గంటలకు కుప్పం నుంచి బయలుదేరి 3.10 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.