YSR Vahana Mitra Scheme: ఆటోవాలాగా మారిన ఏపీ సీఎం జగన్, మాటిచ్చిన ఏలూరులోనే ఆటో డ్రైవర్లకు వరాల జల్లులు, వైయస్సార్ వాహన మిత్ర స్కీమ్ ప్రారంభం, ఆర్థిక భద్రత కోసం ఏటా రూ.10 వేలు, బటన్ నొక్కిన రెండు మూడు గంటల్లోనే..
ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నేరవేర్చుకుంటూ వెళుతున్నారు. గత ఎన్నికలకు ముందు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో జగన్ పాదయాత్ర నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే.
Eluru, October 4: పరిపాలనలో తనదైన ముద్రను వేసుకుంటూ ఏపీ సీఎం జగన్ ముందుకు దూసుకువెళుతున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నేరవేర్చుకుంటూ వెళుతున్నారు. గత ఎన్నికలకు ముందు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో జగన్ పాదయాత్ర నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను తెలుసుకుంటూ నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ ప్రజలకు భరోసానిచ్చారు. ఆ భరోసానే ఆయనకు 2019 ఎన్నికల్లో అఖండ మెజారీటీని తెచ్చింది. ఏపీ సీఎం పీఠం మీద కూర్చోబెట్టింది. ఆ భరోసాను తీర్చేందుకు పాదయాత్రలో ఇచ్చిన హమీలన్నింటిని నేరవేర్చే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే సచివాలయ రిక్రూట్ మెంట్, వాలంటీర్ల ద్వారా లక్షల ఉద్యోగాలను కల్పించారు. ఇప్పుడు ఆటోవాలాలకు కూడా భద్రత కల్పించే దిశగా వైయస్సార్ వాహన మిత్ర స్కీమ్ (YSR Vahana Mitra Scheme)ను ప్రారంభించారు. హామీ ఇచ్చిన ఏలూరులోనే ఈ కార్యక్రమం జరగడం విశేషంగా చెప్పుకోవచ్చు.
జగన్ వరాల జల్లులు
ఆటో, క్యాబ్, కార్లు నడుపుకుని జీవించే పేద వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించడం కోసం ఏటా రూ. 10 వేలు అందించే ‘వైఎస్సార్ వాహనమిత్ర’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏలూరులో ప్రారంభించారు. ఈ పథకం కింద 1,73,531 మంది లబ్దిదారులు ఏడాదికి రూ. 10 వేల చోప్పున అందుకోనున్నారు. పొరబాటున ఎవరికైనా ఈ పథకం వర్తించకపోతే.. ఈ నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు జగన్ తెలిపారు. వాళ్లకు నవంబర్లో వాహనమిత్ర సొమ్మును ఇస్తామని జగన్ చెప్పారు. బటన్ నొక్కిన రెండు మూడు గంటల్లోనే మీ ఖాతాల్లో రూ.10 వేలు జమ అవుతాయని ఏపీ సీఎం జగన్ తెలిపారు.
ఏలూరులో వైఎస్ఆర్ వాహన మిత్ర పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా సీఎం జగన్ కీలక ప్రసంగం చేశారు. లక్షల మంది ప్రయాణికులను నిత్యం గమ్యస్థానానికి చేరుస్తున్నారంటూ ఆటో, ట్యాక్సీ డ్రైవర్లపై సీఎం ప్రశంసలు గుప్పించారు. పాదయాత్ర సందర్భంగా ఇదే ఏలూరులో వాహనమిత్ర పథకాన్ని అమలు చేస్తామని మాటిచ్చానని.. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకుంటున్నానని జగన్ తెలిపారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే వాహన మిత్రను అమలు చేస్తున్నామన్నారు. ఎక్కడా వివక్షకు, అవినీతికి ఆస్కారం లేకుండా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. వైట్ రేషన్ కార్డు ఉండి, ఆటో ఉన్న ప్రతి కుటుంబానికి ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నామన్నారు.
ఈ పథకానికి అర్హులైన లబ్ధిదారుల ఎంపికను సెప్టెంబర్ 14 నుంచి 25 వరకూ నిర్వహించారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తుల్ని స్వీకరించారు. ఆధార్‌కార్డు, తెల్ల రేషన్‌కార్డు, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, రుణం లేని బ్యాంకు పాస్ బుక్ మొదటి పేజీ, సంబంధిత అకౌంట్ వివరాలను అందించిన వారిని లబ్ధిదారులుగా గుర్తించారు. ఇలా దరఖాస్తు చేసుకున్న వారిలో అసలైన లబ్ధిదారులను గుర్తించిన జిల్లాల్లో విశాఖపట్నం రాష్ట్రంలో నంబర్ వన్ స్థానంలో నిలిచింది. అదే సమయంలో జీవీఎంసీ అత్యధిక మంది లబ్ధిదారులను గుర్తించి అర్బన్ విభాగంలో మొదటి స్థానం కైవసం చేసుకుంది.