Jagananna Vasathi Deevena: ప్రతిపక్షం కాదది రాక్షసత్వం! చంద్రబాబును రాక్షసుడితో పోల్చిన సీఎం జగన్, విద్యార్థుల కోసం మరో ప్రతిష్ఠాత్మక పథకం 'జగనన్న వసతి దీవెన' ప్రారంభం

రాష్ట్రంలో ఉంది ప్రతిపక్షం కాదు, రాక్షసత్వం అని, ప్రతిరోజు రాక్షసులతో యుద్ధం చేస్తున్నామంటూ చంద్రబాబు మరియు ఆయన బృందాన్ని సీఎం జగన్ రాక్షసులతో పోల్చారు.....

AP CM YS Jagan| ( File Photo)

Vijayanagaram, February 25:  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan)  'జగన్నన్న వసతి దీనెన' (Jagananna Vasathi Deevena) అనే మరో ప్రతిష్ఠాత్మక పథకాన్ని ప్రారంభించారు. దీని కింద డిగ్రీ, పీజీ చదివే పేద విద్యార్థులకు హాస్టల్ మరియు మెస్ ఖర్చులను ఆర్థిక సహాయం లభించనుంది. ఈ పథకానికి జగన్ ప్రభుత్వం ప్రతీ ఏటా రూ. 2,300 కోట్లు ఖర్చు చేయనుంది. మొత్తం రూ .2,300 కోట్లు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మరియు జూలై నెలల్లో రెండు విడతలుగా విద్యార్థులకు పంపిణీ చేయబడతాయి. విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా ఈ డబ్బులు జమ చేయబడతాయి.

రాష్ట్రంలో ఐటిఐ, పాలిటెక్నిక్, అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యను అభ్యసిస్తున్న మొత్తం 11,87,904 మంది విద్యార్థులకు ఈ పథకం వల్ల ప్రయోజనం చేకూరుతుందని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది.

'జగనన్న వసతి దీవెన' (JVD) పథకం కింద ఐటిఐ చదివే పేద విద్యార్థులకు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 10,000, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు మరియు అండర్ గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లకు ఒక్కొక్కరికి రూ. 20 వేలు లభిస్తాయని సిఎంఓ వెల్లడించింది.

జెవిడి పథకానికి అర్హుడయ్యే ప్రతి విద్యార్థి/ లబ్ధిదారునికి ఒక ప్రత్యేకమైన బార్-కోడెడ్ స్మార్ట్ కార్డు ఇవ్వబడుతుంది. ఈ కార్డులో విద్యార్థి యొక్క పూర్తి వివరాలు నిక్షిప్తం చేయబడి ఉంటాయి.

ఏపీలో ఇంటర్మీడియట్ తర్వాత చదువు కొనసాగించేలా, ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తిని మెరుగుపరచమే జెవిడి పథకం యొక్క లక్ష్యంగా CMO ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రతిపక్షం- చంద్రబాబు -మీడియా దుష్ప్రచారంపై సీఎం జగన్ ఫైర్

విజయనగరం జిల్లాలో సోమవారం సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో కనీవినీ ఎరగని విధంగా చదువుల విప్లవం మొదలు పెట్టామని తెలిపారు. నిరుపేద కుటుంబాల్లో మార్పు రావాలంటే వారి కుటుంబంలో ఎవరో ఒకరు డాక్టర్, ఇంజినీర్, ఐఏఎస్ కావాలన్నారు. ఇందుకోసం ఉన్నత విద్యనభ్యసించే పేద విద్యార్థులను ప్రోత్సహిస్తూ ప్రతీ ఏడాది వారికి రూ. 20 వేల చొప్పున వసతి దీవెన అందిస్తాం, ఎంతమంది విద్యార్థులుంటే అంతమందికి అందిస్తామని జగన్ తెలిపారు. వసతి దీవెన కింద ఏటా రూ.2,300 కోట్లు, విద్యా దీవెన కింద ఏటా రూ. 3,700 కోట్లు. ఈ రెండు పథకాలు కలిపి ఏటా రూ. 6 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. మనం పిల్లలకు ఇచ్చే ఆస్తి చదువే అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.

ఇక పేదల సంక్షేమం కోసం ఇంతలా శ్రమిస్తుంటే కొందరు నిత్యం విమర్శలు చేస్తున్నారు. ఈ ఉగాదికి రాష్ట్రంలో, రికార్డు స్థాయిలో 25 లక్షమంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయిస్తే, ప్రతిపక్షం దానిని ఓర్వలేక తమ పత్రికలు, మీడియాలలో దుష్ప్రచారం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఉంది ప్రతిపక్షం కాదు, రాక్షసత్వం అని, ప్రతిరోజు రాక్షసులతో యుద్ధం చేస్తున్నామంటూ చంద్రబాబు మరియు ఆయన బృందాన్ని సీఎం జగన్ రాక్షసులతో పోల్చారు. చంద్రబాబును (Chandrababu Naidu) ప్రజలు మరిచిపోతారనే భయంతో ఆయన మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించారు. అలాంటి రాక్షసులతో పోరాడేందుకు దేవుడి దయ, ప్రజల దీవెన కావాలంటూ సీఎం జగన్ కోరారు.

ఇదిలా ఉండగా, మహిళల, పిల్లల భద్రతా మరియు వారి రక్షణ కోసం విజయనగరంలో 'దిశ' పోలీస్ స్టేషన్ను సీఎం జగన్ ప్రారంభించారు. మహిళలకు భద్రత, సత్వర న్యాయం చేసే దిశగా ఈ పోలీస్ స్టేషన్ పనిచేయాలని సీఎం పోలీసులకు నిర్ధేశించారు.