Mega Projects in AP: ఏపీలో భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు, త్వరలో మూడు మెగా ప్రాజెక్టులు, రూ.16,314 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఎస్‌ఐపీబీ ఆమోదం, విశాఖలో ఐటీ యూనివర్సిటీ ఏర్పాటు
ఏపీలో ఇకపై భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు రానున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలో మూడు మెగా ప్రాజెక్టులకు (Mega Projects in AP) సంబంధించిన రూ.16,314 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(SIPB) సమావేశం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఇంటెలిజెంట్ సెజ్ లిమిటెడ్, ఏటీసీ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్, అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్‌లు తమ యూనిట్ల ఏర్పాటుకు ముందుకొచ్చాయని, వీటి ద్వారా భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు తెలిపారు.
Amaravati, Nov 4: ఏపీలో ఇకపై భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు రానున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలో మూడు మెగా ప్రాజెక్టులకు (Mega Projects in AP) సంబంధించిన రూ.16,314 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(SIPB) సమావేశం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఇంటెలిజెంట్ సెజ్ లిమిటెడ్, ఏటీసీ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్, అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్‌లు తమ యూనిట్ల ఏర్పాటుకు ముందుకొచ్చాయని, వీటి ద్వారా భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు తెలిపారు.
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో (CM Camp Office) ఎస్‌ఐపీబీ సమావేశం జరిగింది. కొత్తగా పలు మెగా ప్రాజెక్టుల పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనల గురించి అధికారులు ఈ సమావేశంలో (AP CM YS Jagan reviews mega projects at SIPB) వివరించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. విశాఖలో కాలుష్య రహిత గ్రీన్ పరిశ్రమల ఏర్పాటునకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కొత్తగా పలు మెగా ప్రాజెక్టుల పెట్టుబడులకు సంబంధించి అధికారులు వెల్లడించిన వివరాలను ఓ సారి పరిశీలిస్తే..
Here's AP CM Review
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం ఇనగలూరులో ఇంటెలిజెంట్ సెజ్ లిమిటెడ్ ఫుట్‌వేర్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదించిందని, రెండు దశల్లో రూ.700 కోట్ల పెట్టుబడికి సిద్ధమైన ఆ కంపెనీ ద్వారా 10 వేల మందికి ఉపాధి లభించనుందని అధికారులు వెల్లడించారు. అదేవిధంగా ఇంటలిజెంట్ సెజ్ లిమిటెడ్ వైఎస్సార్ జిల్లా పులివెందులలో కూడా యూనిట్ ఏర్పాటు చేస్తుందని, అక్కడ కూడా రెండు వేల మందికి ఉపాధి లభించనుందని సీఎంకు అధికారులు వివరించారు.
విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఏటీసీ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫ్–హైవే టైర్స్ యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చిందని, మొత్తం రూ.980 కోట్లు పెట్టుబడి పెట్టనున్న ఆ సంస్థ ద్వారా రెండు వేల మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని పేర్కొన్నారు.
విశాఖ జిల్లా మధురవాడలో అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ సంస్థ.. ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ పార్క్, ఇంటిగ్రేటెడ్ ఐటీ అండ్ బిజినెస్ పార్క్, రిక్రియేషన్ సెంటర్ ఏర్పాటు ప్రతిపాదన గురించి సమావేశంలో అధికారులు వివరిస్తూ.. రూ.14,634 కోట్లను ఆ సంస్థ పెట్టుబడి పెట్టనుండగా, మొత్తం 24,990 మందికి ఉపాధి లభించనుందని చెప్పారు. అలాగే స్కిల్డ్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదనల గురించి కూడా వారు ఈ సమావేశంలో తెలిపారు.
ఆయా కంపెనీలు కోరుతున్న రాయితీలను, ప్రభుత్వం నుంచి ఆశిస్తున్న సహకారాన్ని, అదే సమయంలో సదరు సంస్థల ద్వారా లభ్యమయ్యే ఉపాధి అవకాశాలను అధికారులు సమావేశంలో వివరించారు. సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, మేకపాటి గౌతమ్‌రెడ్డి, గుమ్మనూరు జయరామ్, సీఎస్ నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికాల వలవన్, పరిశ్రమలు వాణిజ్య శాఖ డైరెక్టర్ జె.సుబ్రమణ్యంతోపాటు వివిధ శాఖలకు చెందిన పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
విశాఖపట్నంలో ఐటీ యూనివర్సిటీ
ఇదిలా ఉంటే ద్వితీయ శ్రేణి (టైర్–2) నగరాల్లో నిపుణులైన ఐటీ ప్రొఫెషనల్స్ కొరత సహజమని, దాన్ని తీర్చడానికి విశాఖపట్నంలో ఐటీ హై ఎండ్ స్కిల్డ్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు సూచించారు. టైర్–1 నగరాల్లో అయితే నిపుణుల కొరత అనే అంశం ఉత్పన్నం కాదు కాబట్టి సమస్యలుండవని, టైర్–2 నగరాల్లో వీరిని తయారు చెయ్యడానికి శిక్షణ అవసరమని ఆయన స్పష్టంచేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రొబోటిక్స్ వంటి అత్యాధునిక అంశాల్లో అక్కడ శిక్షణ ఇవ్వాలన్నారు. ఐటీ విధానంపై ముఖ్యమంత్రి మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికాల వలవన్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ డైరెక్టర్ జె.సుబ్రమణ్యంతోపాటు ఐటీ, పరిశ్రమల శాఖలకు చెందిన పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
హై ఎండ్ స్కిల్డ్ యూనివర్సిటీని ఏర్పాటు చేసే ప్రాంతంలోనే ప్రభుత్వ ఐటీ విభాగం కూడా ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు. ‘ప్రస్తుతం ప్రభుత్వం ఏటా రూ.3,000 కోట్ల విలువైన ఐటీ సేవలను వినియోగించుకుంటోంది. ఇదంతా ఐటీ విభాగం ద్వారానే జరుగుతోంది. ఇంజినీరింగ్‌లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఈ స్కిల్డ్ యూనివర్సిటీలో శిక్షణ ఇవ్వడం ద్వారా వారిలో నైపుణ్యాన్ని మరింత పెంచడానికి వీలవుతుంది.
ప్రభుత్వ ఐటీ విభాగం ఉండటం వల్ల విద్యార్థులకు అప్రెంటిస్ షిప్ సమస్య ఉండదు. ఉపాధి అవకాశాలు కూడా పుష్కలంగా ఉంటాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. తద్వారా అత్యుత్తమమైన మానవ వనరులను తయారు చేసుకునే అవకాశం వస్తుందన్నారు. వీలైనంత త్వరగా ఈ యూనివర్సిటీ పనులు ప్రారంభించాలన్నారు.
స్వదేశీ, విదేశీ ఐటీ దిగ్గజ కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవాలని, ఆయా కంపెనీలు ఇక్కడి విద్యార్థులకు శిక్షణ ఇచ్చేలా, వారిలో నైపుణ్యాన్ని పెంచేలా చూడాలని ఏపీ సీఎం కోరారు. తద్వారా ఐటీ కంపెనీలకు తగినట్టుగా మానవ వనరులు సిద్ధం కావాలని, ఏటా కనీసం రెండు వేల మందికి విశాఖ సంస్థలో శిక్షణ ఇవ్వాలని తెలిపారు. అక్కడ శిక్షణ పొందడం ప్రతిష్టాత్మకంగా భావించాలి. ఆ సర్టిఫికెట్లకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలి. ఐటీలో డిమాండ్‌కు అనుగుణంగా డిగ్రీ లేదా డిప్లొమా కోర్సులు కూడా ప్రారంభించాలని ఏపీ సీం ఆకాంక్షించారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)