AP MPTC, ZPTC Elections 2021: కుప్పంలో ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికలు, 72.19 శాతం పోలింగ్ నమోదైందని తెలిపిన ఎస్ఈసీ నీలం సాహ్ని, ముగిసిన జడ్పీటీసీ ఎంపీటీసీ పోలింగ్, ఈ నెల 18న ఓట్ల లెక్కింపు
ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్యూలైన్లలో ఉన్న ఓటర్లకు ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు.
Amaravati, Nov 16: రాష్ట్రంలో 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల పోలింగ్ (AP MPTC ZPTC Elections 2021) సాయత్రం 5 గంటలకు ముగిసింది. ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్యూలైన్లలో ఉన్న ఓటర్లకు ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు. కాగా, ఈ నెల 18న ఓట్ల లెక్కింపు జరగనుంది.
అనంతపురం జిల్లాలోని చిలమత్తూరు జెడ్పీటీసీ, 16 ఎమ్పీటీసీలకు జరిగిన ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ కేంద్రాల గేట్స్‌ను అధికారులు మూసేశారు. 5 గంటల తర్వాత క్యూలైన్లలో ఉన్న వారికి మాత్రమే ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. జెడ్పీటీసీ, ఎమ్పీటీసీ ఎన్నికల్లో 65 శాతం పోలింగ్ నమోదైంది.
కుప్పం మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని ఎస్‌ఈసీ నీలం సాహ్ని తెలిపారు. జిల్లా కలెక్టర్, ఎస్పీల నుంచి పోలింగ్‌కు సంబంధించి ఎలాంటి రిపోర్టు అందలేదన్నారు. కుప్పం మున్సిపాలిటిలో 72.19 శాతం పోలింగ్ నమోదైందని చెప్పారు. పోలింగ్ పూర్తయ్యాక బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్‌లో కట్టదిట్టమైన భద్రత మధ్య ఉంచామని అన్నారు. అర్బన్ లోకల్ బాడీస్‌లో కౌంటింగ్ రేపు ఉదయం 8 గంటల నుండి ప్రారంభమవుతుందని... కౌంటింగ్ ప్రక్రియ పూర్తైన వెంటనే ఫలితాలను వెల్లడిస్తామన్నారు.
జెడ్పీటీసీ , ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ఈ నెల 18న ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని ఎస్‌ఈసీ తెలిపారు. కౌంటింగ్ పూర్తైన వెంటనే ఫలితాలను వెల్లడిస్తారన్నారు. పన్నెండు మున్సిపాలిటీలకు చైర్మన్‌లు, వైస్ చైర్మన్‌లు ఎంపిక కోసం ఈ నెల 22న ప్రత్యేక సమావేశంలో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తామని పేర్కొన్నారు. అదే రోజు నెల్లూరు మున్సిపల్ కార్పోరుషన్‌కు మేయర్, డిప్యుటీ మేయర్ ఎంపికకు ఎన్నికల నిర్వహిస్తామన్నారు. దీనితో పాటు ఏటపాక మండలం ప్రజా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు కూడా అదే రోజు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని వెల్లడించారు.
ఇదిలా ఉంటే కుప్పం నగర పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ప్రత్యేక పరిశీలకుడిని నియమించాలని కోరుతూ కుప్పం టీడీపీ అభ్యర్ధులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ వేశారు. ఓట్ల లెక్కింపును వీడియో రికార్డింగ్ చేయించాలని పిటిషన్‌లో కోరారు. ఆ పిటిషన్‌ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు పోసాని వెంకటేశ్వర్లు, గింజుపల్లి సుబ్బారావు వాదనలు వినిపించారు. విచారణ ముగిసిన అనంతరం ప్రత్యేక అధికారిగా ఐఎయస్‌ఎన్ ప్రభాకర్ రెడ్డిని నియమించాలని హైకోర్టు పేర్కొంటూ.. ఓట్ల లెక్కింపు మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేయించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. కౌంటింగ్ వీడియో రికార్డింగ్‌ను సోమవారం న్యాయస్థానానికి సమర్పించాలని ధర్మాసనం పేర్కొంది.