AP Panchayat Poll 2021: ఏపిలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికలకు అదనపు మార్గదర్శకాలు జారీ, బ్యాలెట్ కౌంటింగ్ కూడా వీడియో రికార్డింగ్ చేయాలని అధికారులకు ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశం
అంతేకాకుండా, విజేతను ప్రకటించే సమయంలో పది ఓట్ల కంటే తక్కువ తేడా ఉంటే రీకౌంట్ చేయాలని నూతన మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.....
Amaravathi, February 19: నాలుగో దశ పంచాయతీ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అదనపు మార్గదర్శకాలను జారీ చేశారు. ఓట్ల లెక్కింపును తప్పనిసరిగా వీడియో రికార్డ్ చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు సమయంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని, జనరేటర్లు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్‌కాస్టింగ్, వీడియోగ్రఫీ, సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇతరులను కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించవద్దని నిమ్మగడ్డ స్పష్టం చేశారు. అంతేకాకుండా, విజేతను ప్రకటించే సమయంలో పది ఓట్ల కంటే తక్కువ తేడా ఉంటే రీకౌంట్ చేయాలని నూతన మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. వీడియో ఫుటేజ్‌ను కౌంటింగ్ కేంద్రాల్లో భద్రపరచాలని ఎస్‌ఇసి నూతన ఆదేశాలు చెబుతున్నాయి
అంతకుముందు, బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఓట్ల లెక్కింపు యొక్క వీడియో రికార్డింగ్ కోసం SEC ఆదేశాలను పాటించాలని స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు తొలి మూడు విడతలు విజయవంతంగా పూర్తయ్యాయని, కొన్ని అవాంఛనీయ సంఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగానే ముగిశాయని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.