Heavy Rains in Andhra Pradesh: ఏపీలో భారీ వర్షాలు, 2 రోజుల పాటు వార్నింగ్ ఇచ్చిన వాతావరణ శాఖ, సీఎం జగన్ సమీక్ష

భారీ వర్షాలు కురుస్తున్న నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.

Rainfall - Representational Image | Photo - PTI

Andhra Pradesh Rains: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది పశ్చిమ దిశగా కదులుతూ గురువారం నాటికి దాదాపు దక్షిణ కోస్తా – ఉత్తర తమిళనాడు తీరాలకు చేరుకునే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో బుధవారం నాడు కోస్తాంధ్రాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలినచోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఇక గురువారం నాడు దక్షిణకోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలినచోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్లు.. గరిష్ఠంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ కమిషనర్ సూచించారు. గురువారం వరకు మత్స్యకారులు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఇదిలాఉంటే.. 17, 18 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. భారీ వర్షాలు కురుస్తున్న నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో గురువారం జరిగిన ఈ సమావేశంలో.. తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. అవసరమైన చోట్ల సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. రిజయర్వాయర్లు, చెరువులు, నీటినరుల వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ తగిన విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆహారం, మందులు సిద్ధంచేసుకోవాలన్నారు.