APSRTC: ఆ వార్త అబద్దం, నమ్మకండి, బస్సుల్లో మాస్కులేని ప్రయాణికులకు ఫైన్‌లు విధిస్తున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించిన ఏపీఎస్‌ఆర్టీసీ
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు మాస్క్‌లు పెట్టుకోకపోతే అపరాధ రుసుములు విధిస్తున్నారని జరుగుతున్న అవాస్తవ ప్రచారాన్ని ఆర్టీసీ కొట్టిపారేసింది.
Amaravati, Jan 10: ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో మాస్కులేని ప్రయాణికులకు ఫైన్‌లు విధిస్తున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై సంస్థ స్పందించింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు మాస్క్‌లు పెట్టుకోకపోతే అపరాధ రుసుములు విధిస్తున్నారని జరుగుతున్న అవాస్తవ ప్రచారాన్ని ఆర్టీసీ కొట్టిపారేసింది. బస్సు స్టేషన్లలో నిబంధనలు పాటించని వారికి మాత్రమే విధిస్తున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఏపీఎస్‌ఆర్టీసీ ఒక ప్రకటన విడుదల చేసింది.
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణీకుల సౌకరార్థం ఎపీఎస్‌ఆర్టీసీ.. రెగ్యులర్ సర్వీసులతో పాటు, స్పెషల్ బస్సులను నడుపుతుందని.. ఈ రద్దీలో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బస్సులు నడిపేందుకు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు చేపట్టామని ఏపీఎస్‌ఆర్టీసీ తెలిపింది. స్టేషన్ అవరణలో బస్సులకు అడ్డంగా బైక్‌లు, స్కూటర్లు, నో పార్కింగ్ ప్రదేశాల్లో వాహనాలు పార్క్ చేయడం, బస్‌స్టేషన్ పరిసరాలలో బహిరంగంగా మూత్ర విసర్జన, బస్‌స్టేషన్‌లో పనిలేకుండా మాస్క్ ధరించకుండా తిరుగుతున్న వ్యక్తులను నియంత్రించేందుకు మాత్రమే సంబంధింత సెక్యూరీటీ అధికారులు అపరాధ రుసుములు విధిస్తున్నారని ఆర్టీసీ పేర్కొంది.
బస్సుల్లో మాస్కు లేకుండా ఎక్కిన ప్రయాణికులకు మాత్రం ఎటువంటి ఫైన్లు విధించడంలేదని.. కానీ నూతన కోవిడ్ వేరియంట్ నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకునే క్రమంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని ఏపీఎస్‌ఆర్టీసీ విజ్ఞప్తి చేసింది.