Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో వెయ్యి దాటిన కోవిడ్-19 కేసులు, తొలిసారిగా శ్రీకాకుళం జిల్లా నుంచి నమోదైన కరోనావైరస్ పాజిటివ్ కేసులు
తాజాగా శ్రీకాకుళం నుంచి 3 పాజిటివ్ కేసులు నమోదవడంతో జిల్లా వాసుల్లో కలకలం మొదలైంది......
Amaravathi, April 25: ఆంధ్ర ప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 61 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో శనివారం ఉదయం నాటికి రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1016 కు చేరింది. ఈరోజు మరో 2 కరోనా మరణాలు సంభవించాయి. కృష్ణా జిల్లా నుంచి ఒకరు, కర్నూలు జిల్లా నుంచి ఒకరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనావైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 31 కి పెరిగింది.
ఇక ఇప్పటివరకు 171 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 814 యాక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
గత 24 గంటల్లో జిల్లాల నుంచి అందిన రిపోర్ట్స్ మేరకు అత్యధికంగా క్రిష్ణా జిల్లా నుంచి 25, కర్నూలు నుంచి 14, అనంతపురం 5, నెల్లూరు 4, కడప 4, తూర్పు గోదావరి 3, గుంటూరు 3, శ్రీకాకుళం జిల్లా నుంచి 3 కేసులు చొప్పున కొత్తగా నమోదయ్యాయి.
ఇక ప్రకాశం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, చిత్తూరు, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులేమి నమోదు కాలేదు.
జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి
ఇదిలా ఉంటే, ఇంతకాలంగా ఒక్క కేసు కూడా నమోదు కాని శ్రీకాకుళం జిల్లాకు కూడా ప్రాణాంతక కరోనావైరస్ వ్యాప్తి చెందింది. తాజాగా శ్రీకాకుళం నుంచి 3 పాజిటివ్ కేసులు నమోదవడంతో జిల్లా వాసుల్లో కలకలం మొదలైంది. దీంతో ఏపీలో ఒక్క విజయనగరం జిల్లా మినహాయించి రాష్ట్రవ్యాప్తంగా కరోనావైరస్ ప్రభావం కొనసాగుతోంది.
దిల్లీలో పనిచేసే శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి గత నెలలో తబ్లీఘి జమాత్ సభ్యులతో కలిసి రైళ్లో ప్రయాణించాడు. అతణ్ని అప్పుడే అధికారులు గుర్తించి టెస్టులు నిర్వహించగా నిగెటివ్ రిపోర్ట్ వచ్చింది. అయినప్పటికీ 14 రోజుల పాటు హోం క్వారైంటైన్లోనే ఉన్నాడు, అనంతరం క్వారైంటైన్ కాలం ముగిసిన తర్వాత బయటకు వచ్చి, కొంతమందితో కలిశాడు. దీంతో అతడి ద్వారా ముగ్గురికి కరోనావైరస్ సోకిందని అధికారులు భావిస్తున్నారు, కానీ అతడికి మాత్రం ర్యాపిడి యాక్షన్ టెస్టుల్లో నెగెటివ్ రిపోర్ట్ రావటం గమనార్హం.