Chandrababu Gets Bail: చంద్రబాబుకు మధ్యంతర బెయిల్, షరతులు ఉల్లంఘిస్తే బెయిల్ మరుక్షణమే రద్దు, నవంబర్ 24వ తేదీ సాయంత్రం సరెండర్ కావాలని ఏపీ హైకోర్టు తీర్పు
రూ.లక్ష పూచీకత్తు, ఇద్దరు షూరిటీలతో నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ మంగళవారం రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది.
Vjy, Oct 31: స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి మధ్యంతర బెయిల్ లభించింది. రూ.లక్ష పూచీకత్తు, ఇద్దరు షూరిటీలతో నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ మంగళవారం రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది. కేవలం ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆయనకు నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు తెలిపింది .
తనకు నచ్చిన ఆస్పత్రిలో సొంత ఖర్చులతో చికిత్స పొందాలని పేర్కొంది. సరెండర్ అయ్యే సమయంలో చికిత్స, ఆస్పత్రి వివరాలను సీల్డ్ కవర్‌లో జైలు సూపరింటెండెంట్‌కు సమర్పించాలని హైకోర్టు సూచించింది.ఈ క్రమంలో పలు షరతులు విధించింది. చంద్రబాబు మీడియా, ఏ విధమైన రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు.
కేవలం ఆస్పత్రి మినహా మరేయితర కార్యక్రమాల్లో పాల్గొనరాదు. బెయిల్ గడువు ముగిశాక నవంబర్ 24వ తేదీ సాయంత్రం లొంగిపోవాలి. చంద్రబాబు ఈ కేసును ఏ విధంగా ప్రభావితం చేయడానికి వీల్లేదు. షరతులు ఉల్లంఘిస్తే బెయిల్ మరుక్షణమే రద్దు అవుతుందని తీర్పు కాపీలో జస్టిస్ మల్లికార్జున రావు స్పష్టం చేశారు.
చంద్రబాబుకు సీఐడీ మళ్లీ షాక్, మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న అరోపణలపై మరో కేసు నమోదు
అనారోగ్య కారణాలరీత్యా చికిత్స నిమిత్తం మధ్యంతర బెయిలు మంజూరు చేయాలని చంద్రబాబు అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ పూర్తిచేసిన హైకోర్టు.. నేడు తీర్పు వెలువరించింది. నవంబర్ 10న రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టనుంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏసీబీ కోర్టు బెయిలు ఇచ్చేందుకు నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు.
Here's Bail Copy
సెప్టెంబర్ 9న నంద్యాలలో చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసింది. అనంతరం ఆయన్ను విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం రిమాండ్ విధించింది. దీంతో చంద్రబాబును రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. గత 52 రోజులుగా ఆయన జైలులో ఉన్నారు. తాజాగా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో చంద్రబాబు సాయంత్రం విడుదలయ్యే అవకాశముంది.
Here's Videos
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. మిఠాయిలు పంచుకుంటూ, బాణసంచా పేలుస్తూ కార్యకర్తలు, నాయకులు సంతోషంలో మునిగిపోయారు. రాజమండ్రి, హిందూపురం సహా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ అభిమానులు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి సంతోషాన్ని పంచుకుంటున్నారు. టపాసులు కాలుస్తూ హోరెత్తిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘బాబు ఈజ్ బ్యాక్’, ‘నిజం గెలిచింది’ వంటి హ్యాష్‌టాగ్‌లను జత చేస్తున్నారు. ఇప్పుడివి ట్రెండ్ అవుతున్నాయి.