CM YS Jagan Delhi Tour: ముగిసిన సీఎం జగన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటన, రాష్ట్రానికి సంబంధించి కీలక అంశాలపై ప్రధాని మోదీ, అమిత్ షా, గడ్కరీ, నిర్మలాతో చర్చలు, సానుకూలంగా స్పందించిన కేంద్రం
రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ (CM YS Jagan Delhi Tour) వెళ్లిన సంగతి విదితమే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్ మంగళవారం సాయంత్రం ప్రధాని మోదీతో (CM Jagan Meets PM Modi) ఆయన నివాసంలో సమావేశమయ్యారు.
New Delhi, April 6: రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ (CM YS Jagan Delhi Tour) వెళ్లిన సంగతి విదితమే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్ మంగళవారం సాయంత్రం ప్రధాని మోదీతో (CM Jagan Meets PM Modi) ఆయన నివాసంలో సమావేశమయ్యారు. సుమారు గంటకుపైగా జరిగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానితో చర్చించారు.ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పెండింగ్ అంశాలు, విభజన సమస్యలపై సత్వరమే స్పందించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు.
పోలవరం, కడప స్టీల్ ప్లాంట్, తెలంగాణ నుంచి రావాల్సిన రూ.6 వేల కోట్లకుపైగా విద్యుత్తు బకాయిలు, జాతీయ ఆహార భద్రతా చట్టం అర్హుల ఎంపికలో హేతుబద్ధత తదితర అంశాలపై ప్రధానికి సీఎం నివేదించారు. ప్రధానంగా పోలవరం సవరించిన అంచనాలను సత్వరమే ఆమోదించాలని విన్నవించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ మంగళవారం సాయంత్రం ప్రధాని మోదీతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. సుమారు గంటకుపైగా జరిగిన ఈ భేటీలో రాష్ట్రానికి (Andhra Pradesh) సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానితో చర్చించారు.
పోలవరానికి సంబంధించి 2019 ఫిబ్రవరి 11న జరిగిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ప్రాజెక్టు సవరించిన అంచనాలను రూ.55, 548.87 కోట్లుగా నిర్ధారించారు. ఈ అంచనాలకు వెంటనే ఆమోదం తెలపాలి. ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఇంకా రూ.31,188 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఇందులో నిర్మాణ పనుల కోసం రూ.8,590 కోట్లు, భూ సేకరణ, పునరావాసం కోసం రూ.22,598 కోట్లు వ్యయం కానుందని సీఎం తెలిపారు.
రాష్ట్రంలో 1.45 కోట్ల కుటుంబాలకు రేషన్ అందిస్తుండగా ఇందులో కేంద్రం నుంచి కేవలం 89 లక్షల కుటుంబాలకు మాత్రమే అందుతోంది. మిగిలిన 56 లక్షల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా నిధులు ఖర్చు చేస్తూ రేషన్ ఇస్తోంది. ఆర్థికంగా బాగున్న మహారాష్ట్ర, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో 75 శాతం, పట్టణ–నగర ప్రాంతాల్లో 50 శాతం ప్రజలకు రేషన్‌ను కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే ఏపీలో మాత్రం 61 శాతం రూరల్, 41 శాతం అర్బన్ ప్రజలకు మాత్రమే ఇస్తున్నారు. దీన్ని వెంటనే సరిదిద్ది హేతుబద్దత పాటించాలని సీఎం కోరారు.
భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు సంబంధించి సైట్ క్లియరెన్స్ అప్రూవల్ గడువు ముగిసింది. దీనికి తాజాగా క్లియరెన్స్ ఇవ్వాలి. ఈ మేరకు పౌర విమానయాన శాఖకు తగిన ఆదేశాలివ్వాలని సీఎం కోరారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం కడపలో సమగ్ర స్టీల్ ప్లాంట్‌ను నెలకొల్పుతామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. వెంటనే దీనికి కేంద్రం తోడ్పాటు అందించాలని అన్నారు. ఏపీలో 11 బోధనాసుపత్రులు ఉండగా కొత్తగా మరో మూడింటికి కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. వీటి పనులు చురుగ్గా సాగుతున్నాయి. మరో 13 బోధనాసుపత్రులకు కూడా వెంటనే అనుమతులివ్వాలి.
రాష్ట్ర విభజన అనంతరం 58.32 శాతం జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు కేవలం 46 శాతం రెవిన్యూ మాత్రమే దక్కింది. హైదరాబాద్‌ను కోల్పోవడం ద్వారా ఆ నగరం నుంచి అందే 38 శాతం రెవిన్యూను కోల్పోయాం. ఆ తర్వాత కోవిడ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. దాదాపు రూ.33,478 కోట్ల మేర ఆదాయాన్ని కోవిడ్ వల్ల కోల్పోయాం. కోవిడ్ నియంత్రణ, చికిత్స కోసం మరో రూ.7,130 కోట్లను అదనంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితులు అనివార్యంగా తలెత్తాయి. వెంటనే రెవెన్యూ లోటు భర్తీ చేయాలని సీఎం ప్రధానికి విన్నవించారు.
రాష్ట్రంలో గత సర్కారు హయాంలో అదనపు రుణాలకు అనుమతిచ్చారు. కానీ ఇప్పుడు ఆ అదనపు రుణాలకు సరిపడా రాష్ట్ర రుణ పరిమితుల్లో కోత విధిస్తామని అంటున్నారు. దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. విధించిన రుణ పరిమితికి మించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ రుణాలు తీసుకోలేదు. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని రుణాల పరిమితిని సవరించాల్సిందిగా కోరుతున్నామని సీఎం తెలిపారు. తెలంగాణ డిస్కమ్‌లు రూ.6,455.76 కోట్ల మేర బకాయిలను ఏపీ జెన్‌కోకు చెల్లించాల్సి ఉంది. రాష్ట్ర విభజన నాటి నుంచి జూన్ 2017 వరకూ తెలంగాణకు సరఫరా చేసిన విద్యుత్తుకు సంబంధించిన బకాయిలు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బకాయిలను తెలంగాణ నుంచి ఇప్పించి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీ డిస్కమ్‌లను ఆదుకునేలా ఆదేశాలు ఇవ్వాలని సీఎం కోరారు.
కేంద్రమంత్రి సీతారామన్‌కు సీఎం జగన్ విజ్ఞప్తి
రాష్ట్ర రుణపరిమితుల్లో కోతలు విధించడం సరికాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం జగన్ నివేదించారు. మంగళవారం ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశం అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆయన విడివిడిగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఏపీకి రెవెన్యూ లోటు భర్తీ నిమిత్తం ఇచ్చిన నిధుల్లో తీవ్ర వ్యత్యాసం ఉందని నిర్మలా సీతారామన్ దృష్టికి తెచ్చారు. విభజన నాటికి పెండింగ్ బిల్లులు, 10వ వేతన సవరణ సంఘం సిఫార్సుల అమలు కోసం రాష్ట్రం వెచ్చించిన రూ.32,625.25 కోట్లను భర్తీ చేయాలని కోరారు. గత సర్కారు హయాంలో అదనపు రుణాలకు అనుమతిచ్చి ఇప్పుడు ఆ అదనపు రుణాలకు సరిపడా రాష్ట్ర రుణపరిమితుల్లో కోతలు విధించడం సరికాదన్నారు. దీన్ని వెంటనే సవరించాలని కేంద్ర ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేశారు. పోలవరానికి సకాలంలో నిధులు, సవరించిన అంచనాలకు ఆమోదం తదితర అంశాలపైనా ఆర్థికమంత్రితో సీఎం జగన్ చర్చించారు.
జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సీఎం భేటీ
ఏపీకి జీవనాడి లాంటి పోలవరం పనులు త్వరగా పూర్తయ్యేలా సహకరించాలని జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను సీఎం జగన్ కోరారు. సాంకేతిక సలహా కమిటీ నిర్ధారించిన పోలవరం అంచనాలకు వెంటనే ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. కాంపొనెంట్ వారీగా కాకుండా మొత్తం ప్రాజెక్టు పనులు పరిగణలోకి తీసుకుని బిల్లులు చెల్లించాలన్నారు. గోదావరి వరదల కారణంగా దెబ్బతిన్న ఎర్త్ కం రాక్‌ఫిల్ డ్యాం పునాదులకు సంబంధించి కూడా చర్చించారు. దిగువ కాఫర్ డ్యామ్‌కు సంబంధించి ఇప్పటికే డిజైన్లు ఖరారయ్యాయని కేంద్రమంత్రి తెలిపారు. ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్‌కు సంబంధించి డయాఫ్రం వాల్‌ను ఎలా పటిష్టం చేయాలి? కొత్తగా నిర్మించాలా? అనే అంశాలపై నిపుణులతో చర్చలు జరుపుతున్నామని, వారం పదిరోజుల్లోగా ఇవి ఖరారు అవుతాయని ముఖ్యమంత్రికి తెలియచేశారు. పోలవరం నిర్వాసిత కుటుంబాలకు ఎలాంటి ఆలస్యం లేకుండా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు.
అమిత్ షా దృష్టికి పెండింగ్ అంశాలు
విభజన హామీల అమలుపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ముఖ్యమంత్రి జగన్ చర్చించారు. పోలవరం ప్రాజెక్టు, నూతన జిల్లాల ఏర్పాటు, రాష్ట్రానికి ఆర్థిక సహకారం సహా పలు పెండింగ్ అంశాలపై చర్చించినట్లు తెలిసింది.
ఈ రోజు కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ ముగిసింది. సీఎం జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిలు హాజరయ్యారు. బుధవారం ఉదయం జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టుల పై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
విశాఖ- భోగాపురం బీచ్ కారిడర్ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరిన్ని మేలైన ఆలోచనలు చేయాలంటూ గత రాష్ట్ర పర్యటనలో గడ్కరీ ఇచ్చిన సలహామేరకు.. అధికారులు ఆ ప్రయత్నాల్లో ఉన్నారని సీఎం జగన్ వివరించారు.విశాఖ నుంచి వేగంగా భోగాపురం చేరేందుకు సౌకర్యవంతమైన రోడ్డుతోపాటు, పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దడానికి తగిన సహాయ సహకారాలు అందించాలని మంత్రిని కోరారు.
విజయవాడ వెస్ట్రన్ బైసాస్ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని, దీనికి సీఆర్డీయే గ్రిడ్ రోడ్డును అనుసంధానం చేసి పనులు ముందుకుసాగేలా చర్యలు తీసుకోవాలని గడ్కరీని కోరారు. విజయవాడ వెస్ట్రన్ బైపాస్‌కు సంబంధించి మల్టీమోడల్ లాజిస్టిక్ పార్క్‌కు భూములు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని, ఈ భూములను కూడా గుర్తించిందని వెంటనే డీపీఆర్ సిద్ధంచేసి పనులు ముందుకు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.విజయవాడ ఈస్ట్రన్ బైపాస్‌కు సంబంధించి కూడా డీపీఆర్ సిద్ధంచేసి పనులు వేగవంతంగా చేపట్టేలా తగిన చర్యలు తీసుకోవాలంటూ కోరారు.
రాష్ట్రంలో 20 ఆర్వోబీలకు కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఇప్పటికే మంజూరుచేసిందని, మిగిలిన 17 ఆర్వోబీలనూ మంజూరుచేయాలని విజ్ఞప్తిచేశారు. రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాలను, పారిశ్రామిక నోడళ్లను, స్పెషల్ ఎకనమిక్ జోన్లను కలుపుతూ 1,723 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్తగా ఏర్పడ్డ జిల్లాల కేంద్రాలను కలుపుతూ ఈ రోడ్ల నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో దాదాపు 14 ప్రాంతాల్లో రోప్ వే ల నిర్మాణానికి పర్యాటక శాఖ ప్రతిపాదనలు పంపించింది. ఇప్పటికే 2 చోట్ల నిర్మాణానికి అంగీకరించింది. మిగిలిన ప్రతిపాదనలకూ అనుమతి మంజూరుచేయాలని కేంద్రమంత్రి గడ్కరీని కోరారు సీఎం జగన్.
సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ముగియడంతో.. ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఏపీకి తిరుగుపయనం అయ్యారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)