Perni-Nani

Amaravati, April 4: కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో నూతన ఆధ్యాయానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాంది పలికారని మంత్రి పేర్ని నాని (Minister Perni Nani) తెలిపారు. పరిపాలన సౌలభ్యం కోసం ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్‌ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా (AP New Districts) మార్చారని పేర్కొన్నారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ... ప్రజల సౌలభ్యం కోసం 13 కొత్త జిల్లాలను ఏర్పాట్లు చేశారని, ఇది ఆంద్రప్రదేశ్ చరిత్రలో ఒక మైలు రాయిగా నిలుస్తోందన్నారు. కేవలం మూడేళ్ళ అనుభవంలోనే ఇలాంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడం గొప్ప విషయమన్నారు.

మంచి చేసేప్పుడు మంచి అని చెప్పలేని వారు నోటికి తాళం వేసుకోవాలని హితవు పలికారు. వైఎస్‌ జగన్ (CM YS Jagan) చెప్పిన ప్రతిమాటలో 95 శాతం హామీలను నెరవేర్చారని మంత్రి తెలిపారు. చంద్రబాబు హయాంలో పాఠశాలలు మూతవేసే స్థాయి నుంచి ఈ రోజు సీట్లు లేవని బోర్డులు పెట్టే స్థాయికి సీఎం జగన్‌ తీసుకొచ్చారని కొనియాడారు. నలభై ఏళ్ల ఇండస్ట్రీ అని కోతలు కూసే కింగ్ మేకర్ చంద్రబాబు (Chandra Babu) అనుభవం ఏమైందని మంత్రి పేర్నినాని ప్రశ్నించారు. చివరికి ఒక నవ యువకుడి వద్ద కుప్పంను రెవిన్యూ డివిజన్ చేయాలని అభ్యర్థించారని ప్రస్తావించారు.

కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం జగన్‌కు గవర్నర్‌ అభినందనలు, అన్ని ప్రాంతాల ఏకీకృత అభివృద్ధికి బాటలు వేస్తుందని తెలిపిన బిశ్వభూషణ్ హరిచందన్

1979కే 13 జిల్లాలు ఏర్పడితే ఈ 43 ఏళ్లలో పెరిగిన జనాభాకు అనుగుణంగా ఎన్ని జిల్లాలు పెరగాలి. చంద్రబాబు దున్నపోతు ఈనింది అని చెబితే పవన్ కల్యాణ్ కట్టెసే రకం. అమరావతి రైతుల వద్ద భూములు లాక్కుంటే చంద్రబాబుని ఒక్క అడుగు కూడా కదలనివ్వను పవన్ అన్నాడు. దివిస్ ల్యాబ్ వద్దకు వెళ్లి మాటలు చెప్పారు. వారికి ఏం న్యాయం చేశారు. ఉద్దానం వాళ్ళ బాధ్యత తీసుకున్నాను అన్నారు కదా.. ఏమయ్యాయి ఆ బాధ్యతలు. జిల్లాల నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎక్కడున్నాడు పవన్. ప్రభుత్వాన్ని ఏమైనా కలిసి, ఏమైనా సూచనలు చేశాడా..? చంద్రబాబు కార్యాలయం నుంచి వచ్చిన దానిపై సంతకం చేయడం తప్ప ఏమీ చేశావ్? మీరు ప్రభుత్వాన్ని నడిపినప్పుడు ఒక్క రోజైనా ఈ కుకునూరు లాంటి ప్రజల అభిప్రాయాలు వినిపించారా? అని మండిపడ్డారు.

ఏపీలో కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్, నేటి నుంచి 26 జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్, 72కు పెరిగిన రెవెన్యూ డివిజన్లు

పవన్ పల్లకి మోసిన టీడీపీ ప్రభుత్వం కాదు. ప్రజల ఆకాంక్షలతో నడుస్తున్న ప్రభుత్వం. పోలవరం, రంపచోడవరం లాంటి ప్రాంతాల సమస్యలను వైఎస్‌ జగన్ పరిశీలిస్తున్నారు. ప్రజలకు అవసరమైన వాటికి నాలుగు మెట్లు దిగి పరిష్కరించే వ్యక్తి జగన్. గుండెల నిండా టీడీపీ. మనసు నిండా చంద్రబాబు ఉన్న కమ్యూనిస్టు పార్టీ నాయకులు రామకృష్ణ, నారాయణ కూడా మాట్లాడతారు. చంద్రబాబు హయాంలో ఒక్కరోజన్నా శివరామకృష్ణన్ కమిటీ వికేంద్రీకరణ సూచనపై అఖిలపక్షం వేయమని ఆడిగారా? ప్రత్యేక హోదా ఇస్తానన్న, తెస్తానన్న వారిపై అఖిలపక్షం వేయమని ఆడిగారా? ప్యాకేజీ ముద్దు అన్నప్పుడు అఖిలపక్షం కావాలని ఆడిగారా? అప్పుడేమో నోరు కుట్టేసుకుని చంద్రబాబుకి అవసరం అయినప్పుడు మాట్లాడతారు.’ అని ప్రతిపక్ష నాయకులపై మంత్రిపేర్ని నాని నిప్పులు చెరిగారు.