Cyclone Michaung: కోస్తా తీరం వైపు దూసుకొస్తున్న మించౌంగ్ తుఫాను, తీరం వెంబడి హైఅలర్ట్, వచ్చే మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

శనివారానికి తీవ్రవాయుగుండంగా, ఆదివారానికి తుపానుగా (Cyclone Michaung) మారే అవకాశం ఉందని వెల్లడించింది. దీనికి మిచౌంగ్ తుపానుగా నామకరణం చేశారు.

Cyclone Michaung (Photo Credits: X/@RainStorm_TN)

Cyclone Michaung Latest Update: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శనివారానికి తీవ్రవాయుగుండంగా, ఆదివారానికి తుపానుగా (Cyclone Michaung) మారే అవకాశం ఉందని వెల్లడించింది. దీనికి మిచౌంగ్ తుపానుగా నామకరణం చేశారు.

తుపాను సోమవారం సాయంత్రం చెన్నై- మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వివరించింది. తుపాను (Cyclonic Storm) ప్రభావంతో ఆదివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే సూచన ఉందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.

ఈ తుఫాను ప్రభావంతో ఏపీ, తమిళనాడులను భారీ వర్షాలు ముంచెత్తబోతున్నాయి. డిసెంబర్ 4 లేదా 5వ తేదీన ఏపీ తీరానికి సమీపంగా వస్తుందని పేర్కొంది. డిసెంబర్ 3-5 తేదీల మధ్య దక్షిణ ఒడియా, ఉత్తరాంధ్ర తీరానికి సమీపంలో ఈ అల్పపీడనం (Depression in Bay of Bengal) మరింతగా బలపడుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఈ తుపాను భారత ఆగ్నేయ తీరంపై ప్రభావం చూపిస్తుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

చెన్నైలో భారీ వర్షాలు, స్కూళ్లకు సెలవులు ప్రకటించిన అధికారులు, ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక

కోస్తా, తమిళనాడు, పుదుచ్చేరిల్లో శుక్రవారం నుంచి సోమవారం వరకూ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. డిసెంబర్ 1 నుంచి మూడు రోజుల పాటు రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని ఐఎండీ అంచనా వేసింది. అల్పపీడనం కారణంగా కోస్తా ఆంధ్రలో 65.2 మిల్లీమీటర్ల నుంచి 204.4 మిల్లీమీటర్ల వరకూ వర్షపాతం నమోదవ్వొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.

సాధారణంగా ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో ఏర్పడే తుపాన్లు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశాలలో తీరం దాటుతాయి. వాతావరణ మార్పు కారణంగా ఈ సీజన్‌లో ఇప్పటికే రెండు తుపాన్లు ఉత్తరదిశగా వెళ్లిపోయాయి.తమిళనాడు నుంచి ఏపీ వరకు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం దీనికి ఒక కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.ఈ ఏడాది రెండు తుపాన్లు దిశ మార్చుకోవడంతో రాష్ట్రంలో లోటు వర్షపాతం నెలకొంది. నైరుతి, ఈశాన్య రుతుపవనాల వల్ల ఆశించినంతగా వర్షాలు కురవలేదు.

ఏపీకి తుఫాను ముప్పు.. బంగాళాఖాతంలో అల్పపీడనం, త్వరలో తుఫాను బలపడనున్న వైనం.. నేటి నుంచి మూడు నాలుగు రోజుల పాటు కోస్తాతో పాటు రాయలసీమలోనూ వర్షాలు.. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దంటూ వాతావరణ శాఖ హెచ్చరిక

పసిఫిక్‌ సముద్రం మీదుగా వచ్చే తూర్పుగాలుల ప్రభావంతో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మంచి వర్షపాతం నమోదవుతోంది. గతంలో తూర్పుగాలుల ప్రభావం రాష్ట్రం వరకూ ఉండి.. మంచి వర్షాలు పడేవి. ప్రస్తుతం ఆ గాలులు తమిళనాడు వరకే పరిమితమయ్యాయి. ‘ఇటీవల కాలంలో తుపాన్ల గమనాన్ని అంచనా వేయడం కష్టమవుతోంది. ఉష్ణోగ్రతలో 1.5 డిగ్రీల పెరుగుదల, కాలుష్యం అధికమవడంతో ఈ పరిస్థితి ఎదురవుతోంది.