EC Visit to AP: ఏపీలో ఎన్నికల కోలాహలం షురూ, ఏర్పాట్లపై పర్యటించనున్న కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు
దీంతో కేంద్ర ఎన్నికల సంఘం (CEC) అధికారులు రెండు రోజుల పర్యటన కోసం శుక్రవారం ఏపీకి రానున్నారు. ఏపీలో పర్యటించనున్న ఎన్నికల సంఘం అధికారుల బృందంలో సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితేశ్ వ్యాస్, డిప్యూటీ ఎన్నికల కమిషనర్ హిర్దేశ్ కుమార్ ఉన్నారు.
Vijayawada, DEC 21: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు (AP Elections) మరికొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం (CEC) అధికారులు రెండు రోజుల పర్యటన కోసం శుక్రవారం ఏపీకి రానున్నారు. ఏపీలో పర్యటించనున్న ఎన్నికల సంఘం అధికారుల బృందంలో సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితేశ్ వ్యాస్, డిప్యూటీ ఎన్నికల కమిషనర్ హిర్దేశ్ కుమార్ ఉన్నారు. శుక్ర, శనివారాల్లో ఏపీ సీఎస్, డీజీపీతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల అధికారులు సమావేశం నిర్వహిస్తారు. ఓటర్ల జాబితాతో పాటు లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల (AP elections) నిర్వహణపై ఈసీ సమీక్ష నిర్వహించనుంది.
లోకసభతో పాటు ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశాలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాల్లో ఎన్నికల విధులకు హాజరయ్యే అధికారుల బదిలీలపై ఈసీ ఆదేశాలు ఇచ్చింది.
మూడేళ్లకు పైగా ఒకే చోట పనిచేసిన అధికారులను వెంటనే బదిలీ చేయాలని చెప్పింది. సొంత జిల్లాల అధికారులను కూడా వేరే జిల్లాలకు బదిలీ చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. పోలీసు అధికారులు సహా ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులందరికీ ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపింది.