New Excise Policy In AP: ఆంధ్రప్రదేశ్ లో నూతన మద్యం విధానం కోసం 6 రాష్ట్రాల్లో అధ్యయనం, బెస్ట్ పాలసీ కోసం బృందాలను పంపిన ప్రభుత్వం
నాటి వైసీపీ ప్రభుత్వం(YCP Government) మద్యం కొనుగోలు, విక్రయాల్లో అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని, జే బ్రాండ్ (J Brand) తో నాణ్యత లేని మద్యాన్ని సరఫరా చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకున్నారని కూటమి నేతలు ఆరోపించారు.
Vijayawada, AUG 02: ఏపీలో అమలులో ఉన్న మద్యం విధానం ( New Excise Policy) మారనుంది. కొత్త పాలసీని తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నహాలు చేస్తుంది. ఇందుకోసం ఆరు రాష్ట్రాల్లో అధ్యయనం కోసం నాలుగు బృందాలను(Four Teams) ఏర్పాటు చేసింది. నాటి వైసీపీ ప్రభుత్వం(YCP Government) మద్యం కొనుగోలు, విక్రయాల్లో అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని, జే బ్రాండ్ (J Brand) తో నాణ్యత లేని మద్యాన్ని సరఫరా చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకున్నారని కూటమి నేతలు ఆరోపించారు. మద్యం, ఇసుక, నేరాలపై తీవ్రస్థాయిలో ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి రాష్ట్రంలో నూతన ఎక్సైజ్ పాలసీని తీసుకురానున్నది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాలుగు బృందాలు తెలంగాణ(Telangana) , కర్ణాటక, ఉత్తర ప్రదేశ్(Utter Pradesh) , రాజస్థాన్, కేరళ , తమిళనాడులో ఉన్న మద్యం పాలసీని స్టడీ చేసి నివేదికను ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
ఒక్కో బృందంలో ముగ్గురేసి సభ్యులు ఆయా రాష్ట్రాలకు వెళ్లి అధికారులను సంప్రదించి వివరాలు తెలుసుకుని ఈ నెల 12 వ తేదీలోగా నివేదికలు ఇవ్వనున్నారు. మద్యం షాపులు, మద్యం కొనుగోళ్లు, ధరలు, నాణ్యత, డిజిటల్ పేమెంట్‌లపై సమగ్రంగా వివరాలు తెలుసుకోనున్నారు. నివేదికలు అందిన తరువాత సెప్టెంబర్ చివరి వారం నాటికి గాని, అక్టోబర్ మొదటి వారం నుంచి గాని నూతన ఎక్సైజ్ పాలసీని అమలులోకి తీసుకురానున్నారు.