Mudragada Padmanabham: అయ్యా చంద్రబాబు.. నన్ను నా భార్యను ఎంతగా అవమానించారో గుర్తుకు తెచ్చుకోండి, నీ పతనం చూడాలనే ఇన్నాళ్లు చావకుండా బతికి ఉన్నా, చంద్రబాబుకు లేఖ రాసిన సీనియర్ కాపు నేత ముద్రగడ
ఈ లేఖలో (Mudragada Padmanabham Writes Letter to Chandrababu) పలు కీలక అంశాలను ప్రస్తావించారు.
Amaravati, Nov 23: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి మాజీ మంత్రి, కాపు ఉద్యమ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం తాజాగా లేఖ రాశారు. ఈ లేఖలో (Mudragada Padmanabham Writes Letter to Chandrababu) పలు కీలక అంశాలను ప్రస్తావించారు. 'ఈ మధ్య మీ శ్రీమతి గారికి జరిగిన అవమానం గురించి మీరు వెక్కి వెక్కి ఏడవడం టీవీలో చూసి ఆశ్చర్యపోయాను. మా జాతికి ఇచ్చిన హమీని అమలు చేయమని ఉద్యమం చేస్తే.. నన్ను నా కుటుంబాన్ని మీరు చాల అవమాన పరిచారు.
మీ కుమారుడు లోకేష్ ఆదేశాలతో పోలీసులు నన్ను(Senior Kapu leader Mudragada Padmanabham) బూటు కాలితో తన్నారు. నా భార్య, కుమారుడు, కోడల్ని బూతులు తిడుతూ లాఠీలతో కొట్టారు. 14 రోజుల పాటు ఆస్పత్రి గదిలో నన్ను.. నా భార్యను ఏ కారణంతో బంధించారు. మీ రాక్షస ఆనందం కోసం ఆస్పత్రిలో మా దంపతులను ఫోటోలు తీయించి చూసేవారు. మీరు చేసిన హింస తాలుకూ అవమానాన్ని తట్టుకోలేక ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాము.
అణిచివేతతో మా కుటుంబం ఆత్మహత్యకు పూనుకోవాలన్నది మీ ప్రయత్నం కాదా?. నా కుటుంబాన్ని అవమానపరచిన మీ పతనం నా కళ్లతో చూడాలనే ఉద్దేశంతోనే ఆనాడు ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకున్నా.
నా కుటుంబాన్ని ఎంతగానో అవమానించిన మీ నోటి వెంట ఇప్పడు ముత్యాల్లాంటి వేదాలు వస్తున్నాయి. మీ బంధువులు, మీ మీడియా ద్వారా సానుభూతి పొందే అవకాశం మీకే వచ్చింది. ఆ రోజు నాకు సానుభూతి రాకుండా ఉండేందుకు మీడియాను బంధించి నన్ను అనాధను చేశారు. శపధాలు చేయకండి చంద్రబాబు గారు.. అవి మీకు నీటి మీద రాతలని గ్రహించండి' అంటూ ఆ లేఖలో రాసుకొచ్చారు.