Gannavaram Violence Case: పట్టాభితో పాటు మరో 10 మందికి 14 రోజులు రిమాండ్, కులం పేరుతో దూషిస్తూ తనపై దాడి చేశారంటూ ఫిర్యాదు చేసిన గన్నవరం సీఐ కనకారావు
పట్టాభితో పాటు మరో 10 మందికి రిమాండ్ (14 days remand for 15 people) విధిస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. అదే విధంగా చికిత్స నిమిత్తం పట్టాభిని (TDP leader Pattabhi) విజయవాడ ఆస్పత్రికి తరలించాలని ఆదేశాలు జారీ చేశారు
Gannavaram, Feb 22: గన్నవరం ఘటనలో (Gannavaram Violence Case) టీడీపీ నేత పట్టాభికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పట్టాభితో పాటు మరో 10 మందికి రిమాండ్ (14 days remand for 15 people) విధిస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. అదే విధంగా చికిత్స నిమిత్తం పట్టాభిని (TDP leader Pattabhi) విజయవాడ ఆస్పత్రికి తరలించాలని ఆదేశాలు జారీ చేశారు.మిగిలిన 10 మందిని రాజమండ్రి జైలుకు తరలించాలని పోలీసులకు న్యాయమూర్తి సూచించారు.
గన్నవరం సీఐ కనకారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టాభిపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ కార్యకర్తలు రెచ్చగొట్టడం ద్వారా తనకు పట్టాభి సహా ఇంకొందరు టీడీపీ నేతలు ప్రాణహాని కలిగించే ప్రయత్నం చేశారని కనకారావు ఫిర్యాదు చేశారు. తనను కులం పేరుతో దూషించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏ-1గా పట్టాభి, ఏ-2గా చిన్నా సహా మొత్తం 13 మందిపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో గన్నవరం పోలీసులు పేర్కొన్నారు.
తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, వచ్చే 3 నెలల సేవా ఆర్జిత టికెట్లను రేపు విడుదల చేయనున్న టీటీడీ
గన్నవరం నియోజకవర్గ పరిధిలో సోమవారం టీడీపీ, వైఎస్సార్‌సీపీ శ్రేణులు మధ్య ఘర్షణలు జరిగిన నేపథ్యంలో టీడీపీ తలపెట్టిన చలో గన్నవరం కార్యక్రమానికి అనుమతి లేదని కృష్ణా జిల్లా ఎస్పీ జూషువా తెలిపారు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకుడు పట్టాభి.. విధులు నిర్వహిస్తున్న పోలీసుల మీద దాడికి పురి గొల్పడం, బాధ్యతా రహితంగా వ్యాఖ్యలు చేయడం వల్ల శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమైందని చెప్పారు. ఈ ఘటనలో గన్నవరం సీఐ కనకారావు తలకు బలమైన గాయమైందని పేర్కొన్నారు.
పట్టాభి తొందరపాటు చర్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగింది. టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడికి సంబంధించిన వీడియో ఫుటేజీలు పరిశీలిస్తున్నాం. సుమోటోగా రియటింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చట్టాన్ని అతిక్రమించిన వారు ఎవరైనా చట్టరీత్యా చర్యలు తప్పవు. గన్నవరం పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144 CRPC, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది.
ముందస్తు అనుమతి లేకుండా ఏ విధమైన సభలు, సమావేశాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించరాదు.గన్నవరం పరిసర ప్రాంతాల్లోకి ఎవరూ ప్రవేశించకుండా చెక్ పోస్టులు, పికెట్స్ ఏర్పాటు చేశాం. చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైనా అక్రమంగా ప్రవేశించాలని చూస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.' అని ఎస్పీ జాషువా ప్రకటనలో పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ లో ప్రజలు, రాజకీయ పార్టీ శ్రేణులు సహకరించాలని కోరారు.
ఇక కృష్ణా జిల్లా గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీమోహన్‌ను లక్ష్యంగా చేసుకుని మూడు రోజులుగా టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభితో పాటు ఆ పార్టీ నియోజకవర్గ నేతలు పక్కా వ్యూహంతో చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలు, నిరాధార ఆరోపణలు తీవ్ర దుమారానికి దారి తీశాయి. కొద్ది రోజులుగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌పై పట్టాభి పలు అసత్య ఆరోపణలు, తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో పట్టాభిపై స్థానిక కోర్టులో ఎమ్మెల్యే వంశీ పరువు నష్టం దావా వేశారు.ఈ నేపథ్యంలో ఇరువర్గాలు దాడులకు దిగాయి.
నా పని నేను చేసుకుంటున్నా: ఎమ్మెల్యే వల్లభనేని వంశీ
గన్నవరం నియోజకవర్గంలో గడపగడపకు తిరుగుతూ నా పని నేను చేసుకుంటున్నా. టీడీపీ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలతో నా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. సంకల్పసిద్ది మల్టీ లెవల్ మార్కెటింగ్‌కు సంబంధించి ఆధారాలు లేకుండా నాపై అత్యంత దారుణంగా అసత్యాలు ప్రచారం చేశారు. అయినప్పటికీ నేను ఎంతో సంయమనంతో వ్యవహరించాను.
ప్రత్యక్ష గొడవల జోలికి పోకుండా న్యాయం కోసం వారిపై కోర్టులో కేసు వేశాను. కొంత మంది కిరాయి జీతగాళ్లు వారి జీతం పెంచుకోవడం కోసం.. ఏరా.. ఒరేయ్.. బోస్‌డికే.. అంటూ ఇక్కడికొచ్చి నన్ను అతి దారుణంగా తిడుతుంటే నన్ను అభిమానించే వారికి బాధేసింది. అందుకు నిరసన తెలుపుదామని వెళ్లిన వారిపై దాడికి పాల్పడ్డారు. బయట నుంచి టీడీపీ నాయకులు వచ్చి గన్నవరం ప్రజలను రెచ్చగొట్టడం ఎంత వరకు సబబు? ఇక్కడ టీడీపీ నాయకులు లేరా? అంటూ ప్రశ్నించారు.
టీడీపీ నేత కేశినేని చిన్ని
వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (YCP MLA Vallabhaneni Vamsi)పై టీడీపీ నేత కేశినేని చిన్ని (TDP Leader Kesineni Chinni) సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. వంశీ (Vamsi) కి ఓటమి భయం పట్టుకుందన్నారు. ఓటమి భయంతోనే వంశీ గన్నవరం పార్టీ కార్యాలయం (Gannavaram TDP Office)పై దాడి చేశారని ఆరోపించారు. వంశీ, కొడాలి నాని విష పురుగులంటూ వ్యాఖ్యలు చేశారు. వంశీకి దమ్ముంటే టీడీపీ (TDP) వల్ల వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సారి గన్నవరం, గుడివాడలో గెలిచేది టీడీపీనే అని... టీడీపీ గెలుపును ఎవరూ అపలేరని కేశినేని చిన్ని ధీమా వ్యక్తం చేశారు.
పట్టాభి ఏమన్నారంటే..
తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్‌కు ముగ్గురు వ్యక్తులు ముసుగులో వచ్చి తనను అరగంట సేపు కొట్టారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ న్యాయమూర్తి ఎదుట వెల్లడించారు. సీఐ కనకారావు ఫిర్యాదు మేరకు పట్టాభితో పాటు 13 మంది తెదేపా నేతలను అరెస్టు చేసిన పోలీసులు ఇవాళ గన్నవరం కోర్టులో హాజరుపర్చారు. ‘తోట్లవల్లూరు స్టేషన్‌కు వెళ్లే సరికి అంతా చీకటిగా ఉంది. ముగ్గురు వ్యక్తులు ముసుగులో వచ్చి అరగంట సేపు కొట్టారు. వేరే గదిలోకి ఈడ్చుకెళ్లి ముఖానికి టవల్ చుట్టి కొట్టారు. తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్‌లో నాపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు’’ అని కోర్టులో న్యాయవాది, న్యాయమూర్తికి పట్టాభి వివరించారు.