Rain Alert: రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు, బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి, హెచ్చరికలు జారీ చేసిన హైదరాబాద్, విశాఖ తుఫాను వాతావరణ కేంద్రాలు

రాగల 48 గంటల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ,విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం హెచ్చరికలు జారీ చేశాయి.

Heavy Rain Alert In AP, Telangana Over Next 2 Days (photo-file image)

Vijayawada, October 7:  రాగల 48 గంటల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ,విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం హెచ్చరికలు జారీ చేశాయి. దక్షిణ చత్తీస్‌గఢ్ నుంచి కోస్తా కర్ణాటక వరకూ తెలంగాణ, మధ్య కర్ణాటకల మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్టు పేర్కొంది. దీంతో పాటు మధ్య ఒడిశా ప్రాంతాల్లో మరో ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతున్నట్టు తెలిపింది. వీటి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో నేడు అక్కడక్కడ భారీ వర్షాలు, పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం వివరించింది. అలాగే, ఉరుములతో కూడిన జల్లులు కూడా కురుస్తాయని పేర్కొంది.

గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను ముంచెత్తుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆగష్టు నుంచి అన్ని ప్రాంతాల్లో ముందెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వానలు పడ్డాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని వాగులు, వంకలు, కుంటలు అన్ని నిండిపోయాయి. ఇక ఈ వర్షాలు మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో రాగల 48 గంటల్లో అక్కడక్కడా భారీ వర్షాలు, పలుచోట్ల తేలికపాటి వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రానికి బై బై చెప్పనున్నాయి. దాదాపు నెల రోజుల ఆలస్యంగా ఇవి వెనక్కి మళ్లుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇంత ఆలస్యంగా వెళ్లడం ఇదే ప్రథమమని వారు చెప్పుకొచ్చారు.

కాగా కర్ణాటకలో నిరంతరాయంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బగల్‌కోట్‌ జిల్లాలోని ఒక గ్రామంలో ఇల్లుకూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మట్టితో నిర్మించిన వారి ఇంటి పైకప్పు శనివారం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా కూలిపోవడంతో అందులో నివసిస్తున్న దంపతులు, వారి కుమారుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. శిధిలాల క్రింద మట్టిలో ఉన్న వారి మృతదేహాలను అగ్నిమాపక సిబ్బంది వెలికితీసింది. బిజెపి ఎంఎల్‌ఎ వీరన్న చారంతి మత్‌ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. అంత్యక్రియలకు తక్షణమే రూ.15 వేలు విడుదల చేస్తున్నామని, ఆ కుటుంబంలో మిగిలిన సభ్యులు సురక్షిత ప్రదేశంలో నివసించేందుకు ఏర్పాట్లు చేస్తామని ఎంఎల్‌ఎ చెప్పారు. బగల్‌కోట్‌ జిల్లాలో కుండపోతగా కురుస్తున్న వర్షాల కారణంగా మట్టితో నిర్మించిన నివాసాలు బలహీనంగా ఉన్నాయని పోలీసు వర్గాలు తెలిపాయి.