AP ZPTC & MPTC Elections 2021: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్, కౌంటింగ్ జరపొద్దని ఆదేశాలు జారీ చేసిన ఏపీ హైకోర్టు, ఏప్రిల్ 8న యథావిధిగా పరిషత్ ఎన్నికలు
అయితే ఎన్నికల కౌంటింగ్ జరపొద్దని హైకోర్టు (AP High court) ఆదేశించింది. సింగిల్ జడ్జి వద్దకు వెళ్లి పిటిషన్‌ను పరిష్కరించుకోవాలని ధర్మాసనం సూచించింది.
Amaravati, April 7: ఏపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఎన్నికల కౌంటింగ్ జరపొద్దని హైకోర్టు (AP High court) ఆదేశించింది. సింగిల్ జడ్జి వద్దకు వెళ్లి పిటిషన్‌ను పరిష్కరించుకోవాలని ధర్మాసనం సూచించింది. దీంతో ఏప్రిల్ 8న యథావిధిగా పరిషత్ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన స్టేని డివిజన్ బెంచ్ కొట్టివేసింది. అయితే తమ నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఫలితాలను ప్రకటించకూడదని హైకోర్టు ఆదేశించింది.
ఈ కేసులో ఎస్ఈసీ తరఫున సీవీ మోహన్ రెడ్డి వాదనలు వినిపించగా, పిటిషనర్ వర్ల రామయ్య తరపున సీనియర్ న్యాయవాది వేదుల వెంకట రమణ, ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రమణ్యం వాదనలను వినిపించారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై (AP ZPTC MPTC Elections 2021) సింగిల్ బెంచ్ ఆదేశాలను డివిజన్ బెంచ్‌లో ఎస్ఈసీ సవాల్ చేసిన విషయం తెలిసిందే. అర్ధరాత్రి పిటిషన్‌ను హైకోర్టు పరిశీలనలోకి తీసుకుంది. పిటిషన్ వేసిన వర్ల రామయ్య ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి కాదని, వ్యక్తిగత హోదాలో వేసిన పిటిషన్‌ను సింగిల్ బెంచ్ కొట్టేసి ఉండాల్సిందని పేర్కొంది.
నాలుగు వారాలు కోడ్ ఉండాలని నిబంధన లేదని ఎస్‌ఈసీ తెలిపింది. సుప్రీంకోర్టు ఏ సందర్భంలో ఆ ఉత్తర్వులు ఇచ్చిందో పరిగణనలోకి తీసుకోలని ఎస్‌ఈసీ పేర్కొంది. కోడ్ అమలుతో ప్రభుత్వ కార్యక్రమాలు ఆగిపోతాయని సుప్రీం వ్యాఖ్యానించింది. వీటిని పరిగణనలోకి తీసుకొని సింగిల్ బెంచ్ ఉత్తర్వులు కొట్టేయాలని ఎస్‌ఈసీ కోరింది