Inner Ring Road Case: చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 3కి వాయిదా, అప్పటి వరకు లోకేశ్‌ను అరెస్ట్‌ చేయొద్దని హైకోర్టు ఆదేశాలు

రెండ్రోజుల క్రితం చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థలూథ్రా వర్చువల్‌గా వాదనలు వినిపించారు.

Credits: Wikimedia Commons

Vjy, Sep 29: అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ అక్టోబరు 3వ తేదీకి వాయిదా పడింది. రెండ్రోజుల క్రితం చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థలూథ్రా వర్చువల్‌గా వాదనలు వినిపించారు. ఆ తర్వాత సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్‌ వాదనలు కొనసాగించారు.

రింగ్ రోడ్ మార్గంలో లింగమనేనికి భారీగా భూములు ముట్టజెప్పారని, లింగమనేని భూముల పక్కనుంచి వెళ్లేలా అలైన్‌మెంట్‌ మార్పులు చేశారని సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. అలైన్‌మెంట్‌ మార్పు తర్వాత లింగమనేని భూముల విలువ భారీగా పెరిగిందని కోర్టుకు తెలిపారు. లింగమనేని, హెరిటేజ్ సంస్థలు భూఅక్రమాలకు పాల్పడ్డాయని కోర్టుకి ఏజీ తెలిపారు.

త్వరలో కురుక్షేత్ర యుద్ధం, మీకు మంచి జరిగిందనిపిస్తే నా పక్షాన నిలవండి, వాహనమిత్ర నిధుల కార్యక్రమంలో సీఎం జగన్ స్పీచ్ హైలెట్స్ ఇవిగో..

ఏజీ వాదనలకు లూథ్రా కౌంటరు వాదనలు వినిపిస్తూ.. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో తదుపరి వాదనలు కొనసాగించేందుకు విచారణ అక్టోబరు 3కు వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి తెలిపారు. రాజధాని నగరానికి సంబంధించిన బృహత్‌ ప్రణాళిక డిజైనింగ్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, దాన్ని అనుసంధానించే రహదారుల ఎలైన్‌మెంట్‌లో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 2022 ఏప్రిల్‌ 27న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అదే ఏడాది మే 9న సీఐడీ పలువురిపై కేసు నమోదు చేసింది. చంద్రబాబును మొదటి నిందితుడిగా పేర్కొంది. ఈ కేసులో తనకు బెయిలు మంజూరు చేయాలని చంద్రబాబు పిటిషన్‌ వేశారు.

ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. స్కిల్ డెవలప్‌మెంట్‌, ఫైబర్‌నెట్‌ కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ శుక్రవారం ఆయన లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం అక్టోబరు 4వ తేదీ (బుధవారం) వరకు వాయిదా వేసింది. స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో వచ్చే నెల 4 వరకు లోకేశ్‌ను అరెస్ట్‌ చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.ఫైబర్‌ గ్రిడ్‌ కేసులో లోకేష్‌ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కూడా అక్టోబర్‌ 4కు హైకోర్టు వాయిదా వేసింది.