Telangana High Court: జగన్ అక్రమాస్తుల కేసులో ఇండియా సిమెంట్స్‌కు తెలంగాణ హై కోర్టులో ఊరట

జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో ఇండియా సిమెంట్స్‌ కేసులో ఏ-7గా ఉన్న ఇండియా సిమెంట్స్‌ లిమిటెడ్‌ కంపెనీపై సీబీఐ నమోదు చేసిన కేసును శుక్రవారం కోర్టు కొట్టివేసింది.

CBI (Photo-PTI)

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఇండియా సిమెంట్స్‌ కంపెనీకి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో ఇండియా సిమెంట్స్‌ కేసులో ఏ-7గా ఉన్న ఇండియా సిమెంట్స్‌ లిమిటెడ్‌ కంపెనీపై సీబీఐ నమోదు చేసిన కేసును శుక్రవారం కోర్టు కొట్టివేసింది. కంపెనీ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ ఏకసభ్య ధర్మాసనం అనుమతించింది.

అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రభుత్వం నుంచి గనుల లీజులు, నీటి కేటాయింపుల్లో అక్రమంగా లబ్ధి పొంది, క్విడ్ ప్రోగా రాజశేఖర్‌రెడ్డి కుమారుడు జగన్‌కు చెందిన రఘురాం(భారతి) సిమెంట్స్‌, కార్మెల్‌ ఏషియా హోల్డింగ్స్‌, జగతి పబ్లికేషన్స్‌ సంస్థల్లో ఇండియా సిమెంట్స్‌ పెట్టుబడులు పెట్టిందని సీబీఐ తరఫు న్యాయవాది పేర్కొన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా కడప జిల్లాలోని చిలమకూర్‌ వద్ద 2.60 ఎకరాల గనుల లీజు పునరుద్ధరించుకోవడంతో పాటు నల్గొండ జిల్లా విష్ణుపురంలో ఉన్న సిమెంట్‌ ప్లాంటుకు కృష్ణా నది నుంచి రోజుకు 10 లక్షల గ్యాలన్ల నీటిని తీసుకునేలా ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిందని తెలిపారు. జగన్‌కు చెందిన కంపెనీల్లో మూడు దఫాలుగా అధిక ప్రీమియంకు రూ.140 కోట్లు పెట్టుబడులు పెట్టిందన్నారు.

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్ షాక్, మహిళలకు క్షమాపణ చెప్పాలని నోటీసులు..

ఎటువంటి వ్యాపార సంబంధాలు లేకుండా, ఇండియా సిమెంట్స్‌ బోర్డు ఆమోదం లేకుండా జగన్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి నేరపూరిత కుట్రలో భాగమైందని వెల్లడించారు. ఇండియా సిమెంట్స్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించగా, ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధీ పొందలేదని, అప్పటికే ఉన్న కేటాయింపులను పునరుద్ధరించుకున్నామని పేర్కొన్నారు. కంపెనీ బోర్డులో ఆమోదించిన తీర్మానాల మేరకు, లాభాలు వస్తాయనే ఉద్దేశంతోనే ఆయా పెట్టుబడులు పెట్టామని వెల్లడించారు. ఇరు వర్గాల వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. ఇండియా సిమెంట్స్‌పై సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టేస్తూ ఆదేశాలు జారీచేసింది.