Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్ షాక్, మహిళలకు క్షమాపణ చెప్పాలని నోటీసులు..
Pawan Kalyan Serious on Janasena Activists in Farmers Meet File image of Pawan Kalyan | File Photo

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. మూడు పెళ్లిళ్లపై మీ వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి.. మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు.  ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ.. ఇటీవల మీరు మూడు పెళ్లిళ్లపై చేసిన వ్యాఖ్యలు సమాజంలో పెద్ద దుమారం రేపాయి.. భరణం ఇస్తే భార్యను వదిలించుకోవచ్చు అనే సందేశాన్ని ఇస్తూ మీరు మాట్లాడిన మాటలతో మహిళాలోకం షాక్‌కు గురైందన్నారు.

మీ మాటల్లోని తప్పును తెలుసుకుని మహిళాలోకానికి మీరు వెంటనే సంజాయిషీ ఇస్తారని రాష్ట్ర మహిళా కమిషన్ ఎదురుచూసింది.. కానీ, ఇన్ని రోజులైనా మీ మాటలపై మీలో పశ్చాత్తాపం లేదని.. మహిళల ఆత్మగౌరవం దెబ్బతీసినందుకు మీ నుండి క్షమాపణలూ లేవు.. ఎవరి జీవితంలో అయినా మూడు పెళ్లిళ్లు చేసుకోవలసి వస్తే అది ఖచ్చితంగా వ్యతిరేకించే అంశమే.. కోట్ల రూపాయలు భరణంతో విడాకులు ఇచ్చి మూడు పెళ్లిళ్లు చేసుకున్నాను. చేతనైతే మీరూ చేసుకోండి అని మీరు అత్యంత సాధారణ విషయంగా ఎలా మాట్లాడగలిగారు..? అని నిలదీశారు.. కోట్లు, లక్షలు, వేలు ఎవరి స్థాయిలో వారు భరణం ఇచ్చి భార్యను వదిలించుకుంటూపోతే.. ఏ మహిళ జీవితానికి భద్రత ఉంటుంది..? అని ప్రశ్నించారు.

హెల్మెట్ ధరించనందుకు జరిమానా.. బైక్ నెంబర్ మాత్రమే కనిపించేలా ఫోటో అప్ లోడ్ చేసిన ట్రాఫిక్ పోలీసులు..

ఒక సినిమా హీరోగా, ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా మూడు పెళ్లిళ్లపై మీ మాటల ప్రభావం.. సమాజంపై ఉంటుందని మీకు తెలియదా..? అని అని నోటీసుల్లో ప్రశ్నించింది మహిళా కమిషన్‌.. మిమ్మల్ని ఫాలో అవుతున్న యువత చేతనైతే మూడు పెళ్లిళ్లు చేసుకోవచ్చు అనే అభిప్రాయాన్ని తలకెత్తుకోరా..? మీ ప్రసంగంలో మహిళలను ఉద్దేశించి “స్టెప్నీ” అనే పదం ఉపయోగించడం తీవ్ర ఆక్షేపణీయం.. మహిళలను భోగ వస్తువుగా, అంగడి సరుకుగా భావించేవారు ఇటువంటి పదాలను ఉపయోగిస్తారు.

మీ వ్యాఖ్యలపై ఇప్పటికే అనేక మంది మహిళలు మాకు ఫిర్యాదు చేశారు.. మీ మాటలు అవమానకరంగా మహిళా భద్రతకు పెను ప్రమాదంగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. మహిళలను కించపరిచే మాటలు మీరు మాట్లాడటం, చేతనైతే మీరు మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని పిలుపునివ్వడంపై మీరు తక్షణమే మహిళలకు క్షమాపణ చెప్పాలని.. మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ.. పవన్‌ కల్యాణ్‌కు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్.