Andhra Pradesh: వైసీపీని గెలిపించినందుకు రాష్ట్రంలో దుష్ట పాలన సాగుతోంది, జగన్ పాలనలో ఏపీ అభివృద్ధి తిరోగమనంలోకి వెళ్తుంది, వైఎస్ జగన్‌పై కేంద్రంలోని పెద్దలకు పవన్ కళ్యాణ్ ఫిర్యాదు?
గత ప్రభుత్వ హయాంలో.....
New Delhi, November 16: జనసేన (Janasena) అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దిల్లీ పర్యటనలో ఉన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై ఆది నుంచి విమర్శనాస్త్రాలు సంధిస్తున్న పవన్, తరచూ ఏపీ ప్రభుత్వ విధానాలపై వ్యతిరేకిస్తూ వస్తున్నారు. సీఎం జగన్ (CM Jagan) మొండి వైఖరి ప్రదర్శిస్తే అవసరమైతే కేంద్రంలోని పెద్దలను కలుస్తాను గతంలోనే పవన్ చాలా సార్లు హెచ్చరిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో పవన్ హఠాత్తుగా దిల్లీ పయనమవడంతో రాజకీయంగా చర్చనీయాంశం అయింది. అయితే దిల్లీలో ఎవరెవరిని కలుస్తారు? అసలు ఆయన దిల్లీ పర్యటన అజెండా ఏంటి? అనేది అధికారికంగా వెల్లడించకపోయినా, అది ఖచ్చితంగా వైఎస్. జగన్ పాలనపై ఫిర్యాదు చేయడానికే దిల్లీ వెళ్లారనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
ఇటీవల జగన్ సర్కార్ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెడుతూ నిర్ణయం తీసుకున్నపుడు పవన్ కళ్యాణ్ దానిని తీవ్రంగా వ్యతిరేకించారు. అది వైసీపీ మరియు జనసేనల నేతల మధ్య వ్యక్తిగత దూషణల వరకూ వెళ్లింది. పవన్ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. అలాగే జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వలన రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడిందని, ప్రభుత్వం ఏర్పడిన 5 నెలల్లోనే 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని, ఈ విషయాలన్నీ పవన్ కేంద్రం వద్ద ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తుంది.
ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్, జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్వీట్స్ చేశారు. 175 అసెంబ్లీ స్థానాలున్న ఏపీ అసెంబ్లీలో 151 స్థానాల్లో వైసీపీని ప్రజలు గెలిపించినందుకు, వారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐదు నెలల్లోనే 35 లక్షల భవన నిర్మాణ కార్మికుల ఉపాధిని తీసివేసి, 50 మంది కార్మికుల ప్రాణాలు కోల్పోయేలా చేసిన ఘనత వైసీపీకే దక్కిందని పవన్ విమర్శించారు.
అలాగే చంద్రబాబు హయాంలో చేపట్టిన రాజధాని నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు నేడు పూర్తిగా నిలిచిపోయాయని రాష్ట్రానికి వచ్చిన కంపెనీలన్నీ ఏపీని విడిచి వెళ్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను జగన్ ప్రభుత్వం కొనసాగించకపోవడంతో ఏపీ అభివృద్ధి తిరోగమనంలోకి వెళ్తుంది. సీఎం జగన్ దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నారు. సీఎం జగన్ కక్ష సాధింపు పాలనపై దిల్లీ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది అని చెప్తూ, అందుకు సంబంధించి ఒక జాతీయ పత్రికలో వచ్చిన వార్తను పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ఉదహరించారు.
Here's Pawan Kalyan's Tweet:
వైఎస్ జగన్ తన కాళ్లకు ఇసుక బస్తాలను కట్టుకొని నడుస్తున్న వ్యంగ్య చిత్రాన్ని పవన్ పోస్ట్ చేశారు. దీనిని బట్టి, ఈ అంశాలన్నింటినీ పవన్ కళ్యాణ్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు అర్థమవుతుంది. గడిచిన 5 నెలల్లో జగన్ ప్రభుత్వ వైఖరి ఎలా ఉందనేది కేంద్రానికి ఫిర్యాదు చేసే ప్రయత్నం చేస్తున్నట్లు అర్థమవుతుంది.
పవన్ కళ్యాణ్ దిల్లీ పర్యటన వలన జగన్ ప్రభుత్వంపై ప్రభావం పడుతుందా?
ఏపీలో ఉన్నది ఒక ప్రాంతీయ పార్టీ నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వం, అది కూడా అసెంబ్లీలో భారీ సంఖ్యా బలం కలిగిన స్థిరమైన, శక్తివంతమైన ప్రభుత్వం. సాధారణంగా ప్రాంతీయ పార్టీలకు హైకమాండ్స్ ఉండవు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఒకవేళ జగన్ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసినా అది ఎలాంటి ప్రభావం చూపకపోవచ్చు. కాకపోతే రాష్ట్రంలో 'జగన్ పాలన బాగాలేదు' అనేది దిల్లీ స్థాయిలో 'రాజకీయంగా' ఫోకస్ చేయబడుతుంది.
ఒక స్వతంత్ర రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలకు అడ్డు చెప్పే అధికారం కేంద్రానికి గానీ, కోర్టులకు గానీ పరిమితం. పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అది గమనించవచ్చు. మహారాష్ట్రలో రాజకీయాలు గమనించవచ్చు. మహారాష్ట్రలో కేవలం 56 అసెంబ్లీ స్థానాలు గెలిచిన శివ సేన పార్టీనే బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తుంది. అలాంటిది 151 సీట్లు ఉన్న స్వతంత్ర రాష్ట్రమైన ఏపీలో పవన్ కళ్యాణ్ ఫిర్యాదుతో కేంద్రం జోక్యం చేసుకుని ఇప్పటికిప్పుడు ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించే అవకాశం ఖచ్చితంగా ఉండదు. అయితే రాజకీయ కోణంలో రాష్ట్రంలో బీజేపీ బలపడే సూచనలైమైనా ఉన్నాయా అనే అంశంలో ఆలోచన జరగవచ్చు. ప్రస్తుతానికి ఇవన్నీ ఊహాగానాలకే పరిమితం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ కేంద్రం పెద్దలను కలిసిన పక్షంలో దిల్లీలో జరిగిన చర్చల వివరాలు బయటకు వెల్లడవుతే, ఈ అంశాల్లో లోతైన విశ్లేషణ చేసేందుకు ఆస్కారం ఉంటుంది.