Alla Ramakrishna Reddy Joins YSRCP: ఇంకో 30 ఏళ్ల పాటు సీఎంగా జగన్ ఉండాలి, వైసీపీలో చేరిన తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు, ఏ అభ్యర్థికి టికెట్ ఇచ్చినా గెలుపు కోసం కృషి చేస్తానని వెల్లడి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో మళ్లీ వైసీపీలో చేరారు. ఆర్కేకు కండువా కప్పి పార్టీలోకి జగన్ సాదరంగా ఆహ్వానించారు. తన సోదరుడు, ఎంపీ అయోధ్య రామిరెడ్డితో కలిసి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి ఆర్కే వెళ్లారు.
Mangalagiri, Feb 20: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి సొంత గూటికి చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో మళ్లీ వైసీపీలో చేరారు. ఆర్కేకు కండువా కప్పి పార్టీలోకి జగన్ సాదరంగా ఆహ్వానించారు. తన సోదరుడు, ఎంపీ అయోధ్య రామిరెడ్డితో కలిసి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి ఆర్కే వెళ్లారు. పార్టీలో చేరిన అనంతరం ఆర్కే మాట్లాడుతూ.. 175కి 175 ఎమ్మెల్యే స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలవాలని కోరారు.
మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ గెలుపునకు నేను పనిచేస్తా. పేదవారికి జరుగుతున్న మేలును చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయి. 2019లో ఓసీ చేతిలో నారా లోకేష్ ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో బీసీ అభ్యర్థి చేతిలో నారా లోకేష్ ఓడిపోతారు. సీఎం జగన్ మంగళగిరి సీటును బీసీ అభ్యర్థికి ఇస్తామన్నారు. ఏ అభ్యర్థికి టికెట్ ఇచ్చినా గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు.
డిసెంబర్ లో ఆయన వైసీపీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయితే, ఆయన రాజీనామాపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇటీవలే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిన్న రాత్రి ఆర్కేతో వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. మళ్లీ వైసీపీలో చేరేందుకు ఆర్కేను ఒప్పించారు. మరోవైపు, మంగళగిరిలో వైసీపీ గెలుపు బాధ్యతలను ఆర్కేకు అప్పగించవచ్చనే వార్తలు వస్తున్నాయి.