COVID in AP: యూకే నుంచి ఏపికి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్, కొత్త రకం వేరియంట్ అనుమానంతో అప్రమత్తమైన అధికారులు, రాష్ట్రంలో కొత్తగా మరో 357 పాజిటివ్ కేసులు నమోదు
యూకే నుంచి రాజమహేంద్రవరం వచ్చిన ఓ మహిళకు కరోనా పాజిటివ్ అని తేలటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సదరు మహిళను మరియు ఆమె కుటుంబ సభ్యులను ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు.....
Amaravati, December 24: ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినప్పటికీ, ఇప్పుడు కరోనావైరస్ కొత్త వేరియంట్ భయాందోళనలు మొదలయ్యాయి. యూకే నుంచి రాజమహేంద్రవరం వచ్చిన ఓ మహిళకు కరోనా పాజిటివ్ అని తేలటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సదరు మహిళను మరియు ఆమె కుటుంబ సభ్యులను ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. వారి శాంపుల్స్ ను పుణె వైరాలజీ ల్యాబ్ కు పంపారు. వారికి సోకింది కొత్త రకం వేరియంటా లేదా పాతదా? అనేది ఇంకా నిర్ధారణ కావాల్సిఉంది.
ఇక రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే, గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 59,551 మంది శాంపుల్స్ ను పరీక్షించగా మరో 357 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 8,80,075కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 8,77,180గా ఉంది.
గడిచిన ఒక్కరోజులో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లా నుంచి 58, చిత్తూరు నుంచి 54, కృష్ణా జిల్లా నుంచి 54 కొత్త కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.
AP's COVID Update:
గడిచిన ఒక్కరోజులో మరో 4 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 7089కు పెరిగింది.
మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 355 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 8,69,124 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 3,862 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.