MLA Kotamreddy Episode: దటీజ్ జగన్, తప్పు చేస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదన్న ఏపీ సీఎం, అరెస్ట్ చేయాలని నెల్లూరు పోలీసులకు ఆదేశాలిచ్చిన గౌతం సవాంగ్, ఎమ్మెల్యే అరెస్ట్, వెంటనే బెయిల్

ఎమ్మెల్యే కోటంరెడ్డి, అతని అనుచరులు తన ఇంటిపైకి వచ్చి రభస సృష్టించారని వెంకటాచలం ఎంపీడీవో సరళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోటంరెడ్డిని అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

nellore-rural-mla-sridhar-reddy-gets-bail-Jagan tells DGP to let law take its course (Photo-Instagram)

Nellore, October 6:  నెల్లూరు రూరల్‌ వైసిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డికి బెయిల్‌ మంజూరు అయింది. ఎమ్మెల్యే కోటంరెడ్డి, అతని అనుచరులు తన ఇంటిపైకి వచ్చి రభస సృష్టించారని వెంకటాచలం ఎంపీడీవో సరళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోటంరెడ్డిని అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. స్పెషల్‌ జ్యుడీషియల్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసిన అనంతరం కోటంరెడ్డి మాట్లాడుతూ.. ఆధారాలు ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చెప్పారని, ఆయన నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని అన్నారు. విచారణ జరిపి తనపై తప్పు ఉంటే చర్యలు తీసుకోవాలని కోటంరెడ్డి పేర్కొన్నారు.

తన ఇంటిపైకి వచ్చి దౌర్జన్యం చేశారని MPDO సరళ... ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన అనుచరుడు శ్రీకాంత్‌రెడ్డిపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. కాగా ఎమ్మెల్యే కోటంరెడ్డి తనపై దౌర్జ్యనం చేసి బెదిరించారని నెల్లూరు జిల్లా వెంకటాచలం మహిళా ఎంపీడీవో పోలీస్ స్టేషన్ ముందు దీక్ష చేశారు. వెంకటాచలం మండలం గొలగమూడి వద్ద ఓ ప్రైవేటు లేఅవుట్‌కు సంబంధించి పంచాయతీ పైపులైను కనెక్షన్‌ కావాలని తనకు దరఖాస్తు చేసుకున్నారని.. గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్షలు, నియామకాల్లో తీరిక లేకుండా ఉండటంతో పరిశీలించడం ఆలస్యమైందని ఎంపీడీవో ఫిర్యాదులో పేర్కొన్నారు.సరళ కంప్లైంట్‌పై ఎంక్వైరీ జరిపిన పోలీసులు శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల తర్వాత ఆయన్ని నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. పోలీసులు ఎమ్మెల్యే కోటంరెడ్డితో పాటు శ్రీకాంత్‌రెడ్డిపై ఐపీసీ 448, 427, 290, 506 రెడ్‌విత్‌ 34 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు.  ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై కేసు నమోదు, దాడి ఆరోపణలు అబద్దమంటూ కొట్టి పారేసిన ఎమ్మెల్యే

ఈ వివాదంపై స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి డీజీపీతో చర్చించారు. అధికారులతో అనుచితంగా ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించవద్దని డీజీపీ గౌతం సవాంగ్‌కు ఆయన స్పష్టం చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని, చట్టాన్ని ధిక్కరించే వారు ఎవరైనా ఉపేక్షించవద్దన్నట్లు తెలుస్తోంది. సీఎం ఆదేశాల మేరకు ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ నెల్లూరు పోలీసులకు అదేశాలిచ్చారు. దీంతో డీఎస్పీ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఎమ్మెల్యే నివాసముండే నెల్లూరులోని సాయి ఆశ్రయ అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. కాసేపు చర్చల తర్వాత ఆయన్ని అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే వ్యక్తిగత విషయాల్ని కొందరు రాజకీయం చేస్తున్నారన్న కోటంరెడ్డి తాను ఏ తప్పూ చెయ్యలేదని అన్నారు. విచారణలో నిజాలు బయటికొస్తాయని అన్నారు.