Godavari Boat Tragedy: బోట్ వెలికితీత పనులు నిలిపివేత, ఇంతవరకు లభ్యం కాని బోటు ఆచూకీ, కన్నీటిపర్యంతమవుతున్న మృతుల ఆత్మీయులు

ఈఘటనలో ఇంకా 15 మంది పర్యాటకుల ఆచూకీ లభించాల్సి ఉంది...

Operation to salvage boat put on hold. Representational Image | (Photo-Wikimedia commons)

Devipatnam, October 03:  తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద మూడు వారాల కిందట గోదావరి నది (Godavari River) లో బోటు ప్రమాదం సంఘటన విషాదం ఇంకా కొనసాగుతుంది. 19 రోజులు గడిచినా, మునిగిన బోటు ఆచూకీ ఇంకా తెలియరాలేదు. అయితే గోదావరి నదిలో వరద ఉదృతి పెరగడంతో బోటు వెలికితీత చర్యలు నిలిపివేశారు. దీంతో మృతుల బంధువులు తమ ఆత్మీయులను కడసారి కూడా చూడలేకపోతున్నామంటూ కన్నీటిపర్యంతం అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అత్యంత విషాదాన్ని నింపిన బోటు మునక ప్రమాదం సెప్టెంబర్ 15న చోటుచేసుకుంది. ఈఘటనలో ఇంకా 15 మంది పర్యాటకుల ఆచూకీ లభించాల్సి ఉంది.

బోటును వెలికి తీసేందుకు గత మూడు రోజులుగా 25 మందితో కూడిన ధర్మాడి సత్యం (Dharmadi Sathyam) బృందం తీవ్రంగా శ్రమించినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. బోటు మునిగిన ప్రాంతంలో లోతు ఎక్కువగా ఉండటం, అక్కడ సుడిగుండాలు కూడా ఏర్పడే అవకాశాలు ఉండటంతో వెలికితీత పనులు చాలా కష్టంగా మారింది. వరదల కారణంగా మట్టికొట్టుకు వస్తుండటంతో బోటు మట్టిలో కూరుకుపోయి ఉంటుందని భావిస్తున్నారు. దీంతో 'ఆపరేషన్ వశిష్ట' (Operation Vasista) అత్యంత క్లిష్టంగా మారింది.

వరద ఉదృతి కారణంగా వెలికితీత చర్యలు తాత్కాలికంగా పనులు నిలిపివేస్తున్నట్లు ధర్మాడి సత్యం బృందం తెలిపింది. మళ్ళీ వరదలు తగ్గుముఖం పట్టాక ప్రభుత్వ ఆదేశాలతో వెలికితీత కార్యక్రమాలు తిరిగి కొనసాగిస్తామని చెబుతున్నారు. గత రెండు రోజులుగా రెండు రకాల ప్లాన్ లతో బోటును వెలికితీసేందుకు ప్రయత్నాలు చేశామని చెప్పారు. ముంబై, ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన నిపుణుల బృందాలు చెప్పిన చోటులో బోటు లేదని ధర్మాడి సత్యం నిర్ధారించారు. అసలు బోటు ఎక్కడ ఉందో ఇంతవరకు తెలియరాలేదని ఈ నేపథ్యంలో ముందుగా బోటు ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు, అయితే వరద కారణంగా గాలింపు చర్యలు కూడా కష్టమవుతున్నాయి. రేపు వరద ఉదృతి తగ్గితే గాలింపు చర్యలు చేపడతాం, పరిస్థితి ఇలాగే కొనసాగితే వెలికితీర కార్యక్రమాలు మరింత ఆలస్యం అవుతాయని వారు స్పష్టం చేశారు.