Operation Vasista: గోదావరిలో మునిగిన బోటు ఆచూకి దొరికినట్లేనా? యాంకర్లకు తగిలిన బలమైన వస్తువు ఏంటీ? ముమ్మరంగా సాగుతున్న బోటు వెలికితీత పనులు, భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు, 144సెక్షన్‌ అమలు
godavari boat tragedy Sathyam Team Starts Operation 2 Works (Photo-wikimedia)

East Godavari,October 1: తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద పదిహేను రోజుల కిందట గోదావరి నదిలో మునిగిన బోటు సంఘటన ఏపీలో విషాదాన్ని నింపిన సంగతి విదితమే.. ఇప్పటికే ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.మరింత మంది జాడ ఇంకా కానరావడం లేదు. బోటు గోదావరి నదిలో 300 అడుగుల లోతున ఉండిపోవడం వల్ల దాని వెలికితీత సాధ్యం కావడం లేదు. దీనికి తోడు వర్షాలు భారీ పడుతుండటంతో పనులకు ఆటంకం ఏర్పడుతోంది. అయితే ఇప్పుడు కొంచెం పరిస్థితులు కుదుటపడటంతో గోదావరి నదిలో మునిగిన బోటు వెలికితీత పనులు ప్రారంభమయ్యాయి. కాగా ఈ పనులను కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్‌ సంస్థకు ప్రభుత్వం అప్పగించిన విషయం తెలిసిందే. బోటుకు వెలికితీతకు రూ.22.50 లక్షలు చెల్లించేందుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ నేపథ్యంలో ధర్మాడి సత్యం బృందం రోప్‌, లంగర్లతో కచ్చలూరు వద్దకు చేరుకుంటున్నారు. దేవీపట్నం పోలీస్‌ స్టేషన్‌ నుంచి భారీగా సామగ్రిని ప్రమాద ప్రాంతానికి ప్రత్యేక బోటులో తరలిస్తున్నారు.

ధర్మాడి సత్యం బృందం బోటు వెలికితీతకు అవసరమైన యంత్రాలతో గోదావరిలో బోటు మునిగిన ప్రాంతానికి చేరుకుంది. దేవుడు గొంది వద్ద గోదావరి వైపు గల ఇసుక మేటను వేదికగా చేసుకుని ధర్మాడి సత్యం బృందం బోటును వెలికితీసే పనులు చేపట్టింది. బోటు ఉన్నట్టు గుర్తించిన ప్రాంతానికి ఐరన్‌ పంటు, ఏపీ టూరిజం బోటు సహాయంతో వెళ్లి ఐరన్‌ రోప్‌లను బోటు ఉన్నట్టు గుర్తించిన ప్రాంతంలో వలయం మాదిరిగా నదిలోకి జారవిడిచి ఉచ్చులా బిగించారు. బోటు మునిగిన ప్రాంతంలో మొత్తం ఐదు యాంకర్లు వేసినట్లు తెలుస్తోంది. బోటు మునిగిన ప్రాంతం చుట్టూ తిరుగుతూ యాంకర్లను నీటిలో వేయడంతో బలమైన వస్తువు తగిలినట్లుగా ధర్మాడి సత్యం బృందం చెబుతోంది. అది మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటు అయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఆ యాంకర్‌రోప్‌ను పొక్లెయిన్ సాయంతో నెమ్మదిగా బయటికి లాగుతున్నారు. నీటి అడుగున ఉన్న వస్తువులను బయటకు తీసే ప్రక్రియకు చాలా సమయం పడుతుందని, ఆ వస్తువు బోటా? కాదా? అన్నది తెలియాలంటే మరికాస్త సమయం పడుతుందని చెబుతున్నారు. బోటు వెలికితీత పనులు ముమ్మరంగా సాగుతుండడంతో సమీపంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పనులకు ఆటంకం కలగకుండా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. యాంకర్లు బోటును పట్టుకుంటే పంట్లు ద్వారా బయటకు తీసేందుకు పొక్లెయిన్లు సిద్ధంగా ఉన్నాయి.

అప్పటికే సమయం సాయంత్రం 5 గంటలు కావడంతో బోటును వెలికి తీసే పనులు నిలిపివేశారు. ఇక్కడ సుడిగుండాల ప్రమాదం పొంచి ఉండటంతో కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి నేతృతంలోని జిల్లా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. సహాయక చర్యలు జరిగే సమయంలో తాళ్లు తెగి ఎదైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ప్రదేశానికి ఇతరులను రానివ్వకుండా చర్యలు తీసుకున్నారు. బోటు వెలికితీసే సమయంలో ఆ ప్రాంతానికి ఎవరూ రావొద్దని పోలీసులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. ఆ ప్రాంతంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి 144సెక్షన్‌ విధించారు. ధర్మాడి సత్యం నేతృత్వంలో 25 మంది మత్స్యకారులు, నిపుణులు వెలికితీతలో పాల్గొంటున్నారు. క్రేన్‌, ప్రొక్లెయిన్‌, బోటు, పంటు, 800 మీటర్ల వైర్‌ రోప్‌, రెండు లంగర్లు, మూడు లైలాండ్‌ రోప్‌లు, పది జాకీలు, ఇతర సామగ్రి ఉపయోగిస్తున్నారు.

గోదావరిలో మునిగిన బోటు వెలికితీత ప్రక్రియను నది పైనుంచే చేపడతామని ధర్మాడి సత్యం తెలిపారు. బోటు 210 అడుగుల లోతులో ఉండటం వల్ల అక్కడికి ఎవరూ వెళ్లలేరని ఆయన వివరించారు. ఇప్పటికే బోటు ఇసుకలో కూరుకుపోయి ఉంటుందని, వెలికితీత అత్యంత కష్టమైనా పలుసార్లు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. ఈఘటనలో ఇంకా 15 మంది పర్యాటకుల ఆచూకీ లభించాల్సి ఉంది.. వారి డెత్‌ సర్టిఫికెట్ల జారీ కోసం ప్రత్యేక అనుమతులు ఇచ్చామన్నారు. గోదావరిలో ఇంకా రెస్క్యూ బృందాల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.