Heart-Wrenching Incident: మూడేళ్లుగా స్నానం లేదు, కరెంట్ లేదు, లాక్‌డౌన్ నుంచి చీకటి గదికే పరిమితమైన ముగ్గురు, తల్లిదండ్రుల మృతితో మానసికంగా కుంగుబాటు, ఇళ్లంతా చెత్తతో నిండినా కూడా బయటకు రాకుండా జీవనం
మాసిన దుస్తులు, మురికి దేహాలతో కనిపించారు. స్థానికులు గట్టిగా నిలదీయడంతో… తమ అమ్మానాన్నచనిపోయాక కుంగుబాటుకు లోనయ్యామని అందుకే బయటకు రాకుండా ఇంటికే పరిమితమైయ్యామని తిరుపాల్‌శెట్టి చెబుతున్నాడు.
Ananthapur, SEP 18: అమ్మానాన్నలను తీసుకెళ్లిన ఆ దేవుడిపైన కోపమో లేదా వారులేని ఈ ప్రపంచంపై ద్వేషమో ఏమో గానీ, ఒక రోజు కాదు, రెండ్రోజులు కాదు, ఏకంగా మూడేళ్లపాటు ఈ లోకాన్నే చూడటం మానేసింది ఓ కుటుంబం. తల్లిదండ్రులు దూరమయ్యారనే కుంగుబాటుతో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు (Siblings) రాత్రీపగలు ఇంటికే పరిమితమయ్యారు. మూడేళ్ల పాటు చీకటిలోనే బతుకులు సాగిస్తున్న ఈ విషాద ఘటన అనంతపురం వేణుగోపాల్ నగర్ లో (venugopal nager) వెలుగుచూసింది. వేణుగోపాల్ నగర్‌లో నివసిస్తున్న అంబటి తిరుపాల్‌శెట్టికి (tirupalshetty) అక్క విజయలక్ష్మి, చెల్లెలు కృష్ణవేణి ఉన్నారు. వీళ్లెవరికీ ఇంకా పెళ్లి కాలేదు. వాళ్ల నాన్న 2016లో, అమ్మ 2017లో అనారోగ్యంతో చనిపోయారు. దీంతో వారు మానసికంగా బాగా కుంగిపోయారు (depression). బయట ప్రపంచంతో సంబంధాలు తెంచుకున్నారు.
అక్కాచెల్లెళ్లైతే అసలు బయటికి రావడమే మానేశారు. సోదరుడు తిరుపాలశెట్టి మాత్రం… తమ తల్లిదండ్రులు బ్యాంకులో డిపాజిట్ చేసిన డబ్బులకు వడ్డీ వస్తుండటంతో.. నెలకొకసారి బ్యాంక్‌కు వెళ్లి డబ్బులు తెచ్చుకుంటాడు. రోజుకి మూడు సార్లు బయటకెళ్లి తనతో పాటు అక్కాచెల్లెలకు కావలసిన వస్తువులు తీసుకువస్తాడు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం మళ్లీ టిఫిన్ అందిస్తాడు తిరుపాలశెట్టి. అయితే ఆకలి బాధ తెలుస్తున్నవారికీ… కనీసం ఇంటిని శుభ్రం చేసుకోవాలన్న ఆలోచన రాకపోవడం దారుణం. మూడేళ్లుగా చెత్త మొత్తం ఇంట్లోనే ఉంది. ఆ కంపు మధ్యలోనే వారు గడుపుతుండటం గమనార్హం. విద్యుత్ బిల్లు చెల్లించకపోవడంతో రెండేళ్ల కిందట విద్యుత్ అధికారులు ఇంటికి సరఫరా నిలిపివేశారు. దీంతో అప్పటి నుంచి వారు చీకటిలోనే గడుపుతున్నారు. దీనిని గమనించిన పలువురు కాలనీవాసులు… ఇవాళ వారి ఇంటి వద్దకెళ్లి బలవంతంగా తలుపులు తెరిపించారు. తలుపులు తెరిచి స్థానికులు పిలుస్తున్నా.. వారు మాత్రం గాఢ నిద్రలోనే ఉన్నారు.
మూడేళ్లుగా బయటకు రాకపోవడంతో మహిళలిద్దరి జుట్టు జడలు కట్టాయి. మాసిన దుస్తులు, మురికి దేహాలతో కనిపించారు. స్థానికులు గట్టిగా నిలదీయడంతో… తమ అమ్మానాన్నచనిపోయాక కుంగుబాటుకు లోనయ్యామని అందుకే బయటకు రాకుండా ఇంటికే పరిమితమైయ్యామని తిరుపాల్‌శెట్టి చెబుతున్నాడు.