Skill Development Case: నాట్‌ బిఫోర్‌ మీ, చంద్రబాబు కేసు విచారణ నుంచి తప్పుకున్న హైకోర్టు జడ్జి, నేడు హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందుకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుకు సంబంధించి హైకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌, మధ్యంతర బెయిల్‌ కోసం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌లపై దసరా సెలవుల ప్రత్యేక బెంచ్‌ (వెకేషన్‌ బెంచ్‌) నేడు విచారణ జరపనుంది.

chandrababu (Photo-TDP-Twitter)

Vjy, Oct 27: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుకు సంబంధించి హైకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌, మధ్యంతర బెయిల్‌ కోసం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌లపై దసరా సెలవుల ప్రత్యేక బెంచ్‌ (వెకేషన్‌ బెంచ్‌) నేడు విచారణ జరపనుంది. న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప బెంచ్‌ ముందు ఈ బెయిలు పిటిషన్‌ విచారణ జాబితాలో 8వ కేసుగా ఉంది.

ఈ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నెల 19న హైకోర్టు ఈ పిటిషన్‌పై విచారణ జరిపి వెకేషన్‌ బెంచ్‌ ముందుకు వాయిదా వేసింది. చంద్రబాబుకు సంబంధించిన వైద్య నివేదికలను 27నాటి విచారణకు కోర్టు ముందు ఉంచాలని రాజమహేంద్రవరం కేంద్ర కారాగార అధికారులను ఆదేశించిన విషయం విదితమే.

ఇదిలా ఉంటే స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై విచారణ నుంచి న్యాయమూర్తి వైదొలిగారు. ‘నాట్‌ బిఫోర్‌ మీ’ అంటూ న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప విచారణ నుంచి తప్పుకొన్నారు. దీంతో ఈ పిటిషన్‌ను ఏ బెంచ్‌ విచారించాలనే అంశంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకోనున్నారు.

ఏపీ హైకోర్టులో చంద్రబాబు లాయర్లు హౌస్ మోషన్ పిటిషన్, టీడీపీ అధినేత కుడి కంటికి ఆపరేషన్ చేయాలని పిటిషన్‌లో వివరణ

ఇక కంటికి అత్యవసరంగా శస్త్ర చికిత్స అవసరం ఉందని, అంతేకాక వ్యక్తిగత వైద్యుల ద్వారా చికిత్స తీసుకోవాల్సి ఉన్నందున మధ్యంతర బెయిలు మంజూరు చేయాలని చంద్రబాబు గురువారం అత్యవసరంగా (హౌజ్‌ మోషన్‌) పిటిషన్‌ దాఖలుకు అనుమతి ఇవ్వాలని చేసిన అభ్యర్థనకు హైకోర్టు నిరాకరించింది. వ్యాజ్యం దాఖలుకు అనుమతినిచ్చి అత్యవసరంగా విచారణ జరపాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది.

ఏసీబీ కోర్టు జడ్జికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ పంపారు. తన భద్రత, ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన 3 పేజీల లేఖ రాశారు. ఈ నెల 25న రాసిన లేఖను జైలు అధికారుల ద్వారా జడ్జికి పంపారు.నేను జైలుకు వచ్చినప్పుడు అనధికారికంగా వీడియోలు, ఫొటోలు తీశారు. నా ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఈ తరహా వీడియో ఫుటేజ్‌ రిలీజ్‌ చేశారు. నన్ను అంతమొందించేందుకు వామపక్ష తీవ్రవాదులు కుట్ర పన్నుతున్నారు. కుట్రపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి లేఖ కూడా వచ్చింది. ఆ లేఖపై ఇప్పటి వరకు పోలీసు అధికారులు ఎలాంటి విచారణ చేపట్టలేదని లేఖలో పేర్కొన్నారు.

కర్ణాటక రోడ్డు ప్రమాద ఘటనపై సీఎం జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి, బాధిత కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటామని హామీ

జైలులో అనేక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొందరు దుర్మార్గులు జైలులోకి గంజాయి ప్యాకెట్లు విసిరారు. తోటలో ఉన్న కొంతమంది ఖైదీలు గంజాయిని పట్టుకున్నారు. ఖైదీల్లో 750 మంది తీవ్ర నేరాలకు పాల్పడినవారు ఉన్నారు. కొంతమంది ఖైదీల వల్ల నా భద్రతకు తీవ్ర ముప్పు పొంచి ఉంది. ఈనెల 6న జైలు ప్రధాన ద్వారం మీదుగా డ్రోన్‌ ఎగురవేశారు. ములాఖత్‌లో నన్ను కలిశాక వారి చిత్రాల కోసం డ్రోన్‌ ఎగురవేశారు. నాతో పాటు నా కుటుంబసభ్యులకు కూడా ప్రమాదం పొంచి ఉందని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు.

చంద్రబాబును అరెస్టు చేసే సమయంలో సీఐడీ అధికారులు ఎవరితో మాట్లాడారు, వారి ఫోన్‌ కాల్‌ డేటా రికార్డులను భద్రపరిచేలా ఆదేశించాలంటూ ఆయన తరఫు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. ఈ పిటిషన్‌పై సీఐడీ గురువారం కౌంటర్‌ దాఖలుచేసింది. కాల్‌ డేటా బయటకు వెల్లడించడం వల్ల దర్యాప్తు అధికారుల భద్రతకు నష్టం కలుగుతుందన్నారు. గోప్యతకు భంగం కలుగుతుందని పేర్కొంది. చంద్రబాబును అరెస్టు చేసి సీఐడీ కార్యాలయానికి తరలిస్తున్న సమయంలో తమ అనుమతి లేకుండా మీడియా.. వీడియో, ఫోటోలు తీసుకుందన్నారు.