కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సత్యసాయి జిల్లాకు చెందిన ప్రయాణికులు దుర్మరణం చెందడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘చిక్ బళ్ళాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సత్యసాయి జిల్లాకు చెందిన ప్రయాణికులు దుర్మరణం చెందడం ఎంతో కలచివేసింది. మృతిచెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. బాధిత కుటుంబాలకు మన ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుంది. ప్రమాదంలో గాయపడి పరిస్థితి విషమంగా ఉన్న మరో వ్యక్తికి మెరుగైన వైద్యం అందేలా చేస్తున్నాం’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.
చిక్కబళ్లాపుర్లో ఆగి ఉన్న ట్యాంకర్‌ను టాటా సుమో వాహనం ఢీకొట్టగా.. 12 మంది మరణించారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. టాటా సుమోలో మొత్తం 18 మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు.
Here's CM Jagan Tweet
కర్ణాటకలోని చిక్‌బళ్ళాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సత్యసాయి జిల్లాకు చెందిన ప్రయాణికులు దుర్మరణం చెందడం ఎంతో కలచివేసింది. మృతిచెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. బాధిత కుటుంబాలకు మన ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుంది.…
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 26, 2023
పొగ మంచు వల్లే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. మృతులంతా సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కూలీ పనుల కోసం బెంగళూరు వెళ్తుండగా ఘటన జరిగింది. ఘటనా స్థలాన్ని చిక్‌బళ్లాపూర్ ఎస్పీ నగేష్ పరిశీలించారు. ఉదయం 7 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని, మృతుల్లో 9 మంది పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారని తెలిపారు.