Skill Development Scam Case: ఏపీ హైకోర్టులో చంద్రబాబు లాయర్లు హౌస్ మోషన్ పిటిషన్, టీడీపీ అధినేత కుడి కంటికి ఆపరేషన్ చేయాలని పిటిషన్‌లో వివరణ
తాజాగా ఆయన బెయిల్ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలంటూ హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
VJY, Oct 26: స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్న సంగతి విదితమే. తాజాగా ఆయన బెయిల్ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలంటూ హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 3 నెలల క్రితం చంద్రబాబు ఎడమ కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ జరిగిందని పేర్కొన్నారు. ఇప్పుడు కుడి కంటికి ఆపరేషన్ జరపాల్సి ఉందని పిటిషన్‌లో వివరించారు.
ఇక స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి హైకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్, మధ్యంతర బెయిల్ కోసం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌లపై దసరా సెలవుల ప్రత్యేక బెంచ్ (వెకేషన్ బెంచ్) శుక్రవారం (27న) విచారణ జరపనుంది. న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప బెంచ్ ముందు శుక్రవారం 8వ కేసుగా ఈ బెయిలు పిటిషన్ విచారణ జాబితాలోకి వచ్చింది.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసు, రేపు హైకోర్టు ముందుకు చంద్రబాబు బెయిల్ పిటిషన్
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నెల 19న హైకోర్టు ఈ పిటిషన్‌పై విచారణ జరిపి వెకేషన్ బెంచ్ ముందుకు వాయిదా వేసింది. చంద్రబాబుకు సంబంధించిన వైద్య నివేదికలను 27నాటి విచారణకు కోర్టు ముందు ఉంచాలని రాజమహేంద్రవరం కేంద్ర కారాగార అధికారులను ఆదేశించిన విషయం విదితమే.