Skill Development Scam Case: పక్కా ఆధారాలతోనే కేసును ముందుకు తీసుకెళ్లాం, పీవీ రమేశ్ స్టేట్ మెంట్‌తోనే కేసు నడవడం లేదని తెలిపిన సీఐడీ వర్గాలు
అయితే దీనిపై ఏపీ సీఐడీ స్పందించింది.
Vjy, Sep 11: స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో తన స్టేట్‌మెంట్ ఆధారంగానే కేసు పెట్టారనడం దిగ్భ్రాంతికరమని విశ్రాంత ఐఏఎస్ అధికారి, గతంలో ఏపీ ప్రభుత్వంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించిన పీవీ రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై ఏపీ సీఐడీ స్పందించింది. పీవీ రమేశ్ ఇచ్చిన ఒక్క స్టేట్‌మెంట్‌తోనే కేసు మొత్తం నడవడం లేదని సీఐడీ వర్గాలు బదులిచ్చాయి.
దర్యాప్తు ప్రక్రియలో పీవీ రమేశ్ స్టేట్ మెంట్ ఒక భాగం మాత్రమే. ఈ కేసులో ఆరోపణలకు సంబంధించి అన్నిరకాల ఆధారాలున్నాయి. అధికార దుర్వినియోగం సహా నిధుల మళ్లింపునకు సంబంధించి ఆధారాలున్నాయి. పక్కా ఆధారాలతోనే కేసును ముందుకు తీసుకెళ్లాం అని సీఐడీ వర్గాలు చెబుతున్నాయి. కేసు కోర్టు పరిధిలో ఉండగా పీవీ రమేశ్ వ్యాఖ్యలు చేయడం అయోమయానికి గురిచేసే ప్రయత్నమే. ఇది దర్యాప్తును, విచారణను ప్రభావితం చేయడమే అవుతుంది.
నిధుల విడుదలలో తన దిగువ స్థాయి అధికారి చేసిన సూచనను పీవీ రమేశ్ పట్టించుకోలేదు. రూ.371 కోట్లు విడుదలచేసేముందు, అంతమొత్తం ఒకేసారి విడుదల చేయడం కరెక్టు కాదని ఆమె వారించారు. పైలట్ ప్రాజెక్టుగా ఒక స్కిల్ హబ్‌కు ముందుగా విడుదల చేద్దామని గట్టిగా సూచించారు. ఎక్కడో గుజరాత్‌లో చూసి వచ్చాం, అంతా కరెక్టు అనుకోవడం సమంజసంగా లేదని ఆమె అన్నారు. ఈ అభ్యంతరాలను, సూచనలను పీవీ రమేశ్ పక్కనపెట్టారు. ఇలా ఎన్నో అంశాలు కేసులో ఉన్నాయి. పీవీ రమేశ్ చెప్పినట్టుగా హాస్యాస్పదంగానో, పేలవంగానో కేసును బిల్డ్ చేయలేదు అని సీఐడీ వర్గాలు స్పష్టం చేశాయి.
కాగా ఈ కేసుపై గతంలో ఆయన సీఐడీకి లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చారు. తాజాగా ఆయన మాట్లాడుతూ..నా వాంగ్మూలంతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారనడం హ్యాస్యాస్పదం. నేను అప్రూవర్‌గా మారారనే ప్రచారం అవాస్తవం. అసలు ఫైలే లేకుండా కేసులు ఎలా పెడతారు?స్కిల్ డెవలప్‌మెంట్‌లో ఆర్థికశాఖ ఏ తప్పూ చేయలేదు. సీఐడీ తీరుపై అనుమానం కలుగుతోంది. నేను చెప్పింది సీఐడీ తనకు అనుకూలంగా మార్చుకుందని నా అనుమానం. గతంలో నిధులు విడుదల చేసిన వారిలో కొందరి పేర్లు కేసులో లేవు. స్కిల్ డెవలప్‌మెంట్ ఎండీ, కార్యదర్శి పాత్రే ప్రధానం.. వారి పేర్లు ఎందుకు లేవు? అని పీవీ రమేశ్ ప్రశ్నించారు.