Weather Update: ఎండలతో అల్లాడిపోతున్న ఏపీ ప్రజలకు శుభవార్త, రాగల ఐదు రోజుల పాటు తేలికపాటి వర్షాలు, జూన్‌ 15వ తేదీ నాటికి రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ఆగమనం

కోస్తా నుంచి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోందని.. దీని ప్రభావంతో రాగల ఐదు రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Credits: Twitter

ఎండలతో అల్లాడిపోతున్న ఏపీ ప్రజలకు భారత వాతావరణ శాఖ శుభవార్తను తెలిపింది. కోస్తా నుంచి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోందని.. దీని ప్రభావంతో రాగల ఐదు రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఈ ఏడాది జూన్‌ 15వ తేదీకి రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

ప్రతి ఏడాదీ మే 20 నాటికి అండమాన్‌ సముద్రం, దక్షిణ బంగాళాఖాతంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. జూన్‌ 1 నాటికి కేరళను తాకుతాయి. అప్పట్నుంచే దేశంలో నైరుతి రుతుపవనాల ప్రభావం మొదలవుతుంది. అయితే ఈ ఏడాది ‘నైరుతి’ మూడు రోజులు ఆలస్యంగా జూన్‌ 4 నాటికి కేరళను తాకే అవకాశం ఉందని ఇప్పటికే భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

అత్యవసరమైతేనే బయటకు రండి, పగలు బయటకు రావద్దని హెచ్చరించిన వాతావరణ శాఖ, తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగలు

గతేడాది మే 20వ తేదీ కంటే వారం రోజుల ముందే నైరుతి రుతుపవనాలు అండమాన్‌ సముద్రంలోకి ప్రవేశించాయి. ఈసారి మాత్రం ఒకటి, రెండు రోజుల ముందు ప్రవేశించి.. ఈనెల 22 నాటికి అండమాన్, నికోబార్‌ దీవుల అంతటికీ విస్తరిస్తాయని ఐఎండీ పేర్కొంది. మరోవైపు రుతుపవనాల ప్రవేశానికి సూచికగా మూడు రోజులుగా అండమాన్, నికోబార్‌ దీవుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

ఈ సారి కాస్త ఆలస్యంగా వ‌ర్షాకాలం, జూన్ 4న కేర‌ళ‌కు నైరుతీ రుతుప‌వ‌నాలు, 4 రోజులు లేట్‌గా రుతుప‌వ‌నాలు రానున్న‌ట్లు తెలిపిన ఐఎండీ

అనంతరం రుతుపవనాలు జూన్‌ 4 నాటికి కేరళను తాకనుండటంతో.. ఆ ప్రభావం ఏపీపైనా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి నైరుతి రుతుపవనాలు కేరళను తాకిన పది రోజుల్లోగా రాయలసీమ మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తాయి. అనంతరం మరో వారం రోజుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు విస్తరిస్తాయి. అంతా అనుకూలిస్తే జూన్‌ 10కి బదులు 15వ తేదీకల్లా రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ సీజన్‌లోనూ రాష్ట్రంలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

రాష్ట్రంలో నిన్నటితో పోలిస్తే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయి.నిన్న జంగమహేశ్వరం లో 45.2 బాపట్ల 45 నరసాపురం 43.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. విశాఖపట్నం, ఆరోగ్యవరం, కళింగపట్నం ప్రాంతాల్లో సగటున 40 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రత నమోదైంది.