తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగమంటున్నాడు. రెండు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత రెండు మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. సాధారణం కంటే 2-3 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం (ఐఎండీ) ప్రకటించింది.
కొన్ని జిల్లాల్లో 44-45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరాయి. ఉత్తర, ఈశాన్య, తూర్పు తెలంగాణ జిల్లాల్లో 40 డిగ్రీలకు పైన, మిగిలిన జిల్లాల్లో సాధారణం కంటే ఒకటి రెండు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ నాగరత్న తెలిపారు. వాయువ్య భారతం నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో వడగాల్పులు వీస్తున్నాయి.
ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోనూ ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరాయి. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరాయి. అత్యధికంగా రాజమండ్రి ధవళేశ్వరం వద్ద 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రత్యేకంగా ఉభయ గోదావరి నుంచి నెల్లూరు వరకు ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి. దీంతో అత్యవసర పనులు ఉంటే తప్పించి ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండడమే మంచిదని వాతావరణ శాఖ సూచించింది.
ఏపీలో ఈరోజు 20 మండలాల్లో వడగాల్పు ప్రభావం ఉందని ఏపీ విపత్తుల నిర్వాహణ సంస్థ వెల్లడించింది. అనకాపల్లి జిల్లా 2, గుంటూరు 2, కాకినాడ 1, ఎన్టీఆర్ 3, పల్నాడు 3, వైఎస్సార్ జిల్లాలో 9 మండలాల్లో వడగాల్పులు ప్రభావం ఉంటుందని, మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం ఉండనున్నట్లు పేర్కొంది.
నేడు జిల్లాలో ఉష్ణోగ్రతల వివరాలు...
- ఈరోజు ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు,తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44°C - 45°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం.
- శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41°C - 43°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం.
- కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41°C - 43°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం.
- విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 36°C - 40°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం.