Heatwave Representational Image (File Photo)

Hyd, May 16: తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. మరో మూడు రోజులపాటు ఇదే తీవ్రతతో కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. పగటిపూటే కాదు.. రాత్రి పూట ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయని చెబుతోంది.వాయవ్య భారత్ నుంచి వీస్తున్న వేడిగాలుల కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతల తీవ్రత పెరిగినట్లు ఇదివరకే భారత వాతావరణ విభాగం వివరించింది.అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.

గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు పైనే నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేయగా అది నిజమైంది. తెలంగాణలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 41 డిగ్రీల దాకా నమోదయ్యాయి. దిగువ స్థాయిలోని గాలులు వాయవ్య దిశ నుంచి తెలంగాణ వైపుకు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. వరంగల్‌ 43, నల్లగొండ, ఖమ్మం 44, భూపాలపల్లిలో 45 డిగ్రీలు, నల్గొండ నిడమనూరులో 45 డిగ్రీలు, ములుగు తాడ్వాయి 44.5 డిగ్రీల సెల్సియస్‌ టెంపరేచర్లు నమోదు అయ్యాయి.

ఏపీలో ఎండదెబ్బకు నలుగురు మృతి, రెండు రోజులు బయటకు రావొద్దని ఐఎండీ హెచ్చరిక, అన్ని జిల్లాలో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

మరోవైపు ఏపీలో ఏకంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సాధారణం కంటే 4-6 డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం గరిష్ఠ ఉష్ణోగ్రత దాదాపుగా 46 డిగ్రీలు దాటిపోయింది. ప్రకాశం 46, ఏలూరు, విజయవాడలో 47, గుంటూరులలో 48 డిగ్రీలు, రాజమండ్రిలో అత్యధికంగా 49 డిగ్రీల టెంపరేచర్లు నమోదు అయినట్లు తెలుస్తోంది.

Here's Tweet

రేపు 9 మండలాల్లో తీవ్రవడగాల్పులు  వీస్తాయి, 194 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నవి.సోమవారం నెల్లూరు జిల్లా కొండాపురంలో 46.4°Cలు, ప్రకాశం జిల్లా జరుగుమిల్లిలో 46.2°Cలు, కృష్ణా జిల్లా కోడూరులో 46°Cలు అధిక ఉష్ణోగ్రతలు నమోద అయ్యాయని అధికారులు తెలిపారు.

వడదెబ్బతో తెలంగాణలో ముగ్గురు, ఏపీలో ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తోంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఏకంగా 20 మంది వడదెబ్బ బారినపడి ఆస్పత్రిపాలయ్యారు. వాతావరణ మార్పులతో హెపటైటిస్‌-బీ ప్రమాదం పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బయటకు వెళ్లేవాళ్లు తలకు రక్షణ ధరించాలని, మంచినీళ్లు, సహజ సిద్ధమైన పానీయాలు, ఓఆర్‌ఎస్‌ లాంటి ఎనర్జీ డ్రింక్స్‌ వెంటపెట్టుకుని వెళ్లడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.