Heat wave. Representational Image. (Photo Credits: Pixabay)

VJY, May 16: ఆంధ్రప్రదేశ్ రాఫ్ట్రంలో మంగళవారం తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా గుంటూరు, కృష్ణ, ఎన్టీఆర్‌ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వృద్ధులు, చిన్నారులు, గర్బిణీలు జాగ్రత్తగా ఉండాలి వాతావరణ శాఖ తెలిపింది.

రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం అన్ని జిల్లాల్లోనూ (శ్రీ సత్యసాయి మినహా) ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి­పోయాయి. దక్షిణ కోస్తా జిల్లాల్లో అయితే ఎండ మండిపోయింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూ­రు, కాకి­నాడ, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లోని అన్ని మండలాల్లో 42 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవడాన్ని బట్టి అక్కడ ఎండ తీవ్రతను అంచనా వేయవచ్చు. మన్యం ప్రాంతంలోనూ ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల వరకు నమోదయ్యాయి.

రైతు కన్నీటి కథ ఇదిగో, కూలీ ఖర్చులు రాలేదని 4 టన్నుల మామిడికాయలను ఫ్రీగా పంచిన రైతు

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొండాపురంలో అత్యధికంగా 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత ప్రకాశం జిల్లా పచ్చవలో 46.2, కృష్ణా జిల్లా కొండూరులో 46, గుంటూరు జిల్లా పొన్నూరులో 45.9, పల్నాడు జిల్లా రావిపాడులో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2021, 22 సంవత్సరాల్లో వేసవి ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో 46 డిగ్రీలు దాటలేదు. 45 డిగ్రీలకు చేరుకున్నా అది కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. కానీ ఈ సంవత్సరం 46 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవగా, మెజారిటీ ప్రాంతాల్లో 42 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదైంది.

వచ్చే రెండు రోజులు ఎండలు మరింత తీవ్రం కానున్నాయి. కోస్తా జిల్లాల్లో తీవ్రమైన హీట్‌ వేవ్‌ ఉంటుందని ఇప్పటికే భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. మంగళవారం 9 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 194 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్‌ అంబేడ్కర్‌ తెలిపారు.

తెలంగాణలో రానున్న మూడు రోజులు తీవ్ర ఎండలు, ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక

గుంటూరు జిల్లా దుగ్గిరాల, కొల్లిపర, మంగళగిరి, పెదకాకాని, తాడేపల్లి, తాడికొండ, తుళ్లూరు మండలాలు, కృష్ణా జిల్లా పెనమలూరు మండలం, ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో తీవ్రవడగాల్పులు ఉండే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణిలు, బాలింతలు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఎండబారిన పడకుండా చూసుకోవాలన్నారు.

ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బకు గురై సోమవారం ప్రకాశం జిల్లాలో నలుగురు మృతిచెందారు. జరుగుమల్లి మండలం కె.బిట్రగుంటకు చెందిన సాబినేని సుబ్బమ్మ (56), పాపిశెట్టి సూరిబాబు(57), పొందూరి సుబ్బరామిరెడ్డి (68), సింగరాయకొండ మండలం పాతసింగరాయకొండ పంచాయతీకి చెందిన కొట్టే పేరమ్మ(65) వడదెబ్బకు గురై మరణించిందని కుటుంబ సభ్యులు తెలిపారు.