Skill Development Scam Case: చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నేడు సుప్రీంకోర్టు తీర్పు, 17, 19వ తేదీల్లో బాబుకు సంబంధించి రెండు కీలక కేసులపై విచారణ
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎఫ్‌ఐఆర్ రద్దు చేయాలంటూ చంద్రబాబు సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Vjy, Jan 16: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎఫ్‌ఐఆర్ రద్దు చేయాలంటూ చంద్రబాబు సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం 1 గంటకు జస్టిస్ అనిరుద్ధబోస్ నేతృత్వంలోని బెంచ్ వెలువరించనుంది.
ఈ పిటిషన్‌పై గతేడాది అక్టోబర్‌లోనే విచారణ పూర్తయ్యింది. సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, హరీశ్ సాల్వే చంద్రబాబు తరపున వాదనలు వినిపించారు. ఇక సీఐడీ పక్షాన ముకుల్ రోహత్గీ వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన బెంచ్ తీర్పును వాయిదా వేస్తూ అక్టోబర్ 17న నిర్ణయించింది. ఆ తీర్పు నేడు వెలువడనుంది.
ప్రధాని మోదీ ఏపీ పర్యటన నేడు.. లేపాక్షి ఆలయాన్ని సందర్శించనున్న మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తన అరెస్ట్ అక్రమమని చంద్రబాబు వాదిస్తున్నారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఏ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే ఏపీ సీఐడీ తనపై కేసు నమోదు చేసి, అక్రమంగా అరెస్ట్ చేసిందని, కాబట్టి ఈ కేసును కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టులో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. గతేడాది సెప్టెంబర్ 22న ఏపీ హైకోర్టు తన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.
ఇదిలావుంచితే.. ఈ నెల 17, 19వ తేదీల్లో చంద్రబాబుకు సంబంధించిన రెండు కీలక కేసులపై విచారణ జరగనుంది. ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని ఏపీ ప్రభుత్వం సవాలు చేసిన పిటిషన్లపై విచారణ జరగనుంది.