Chandrababu Prajayatra: ప్రజాయాత్రకు సిద్దమవుతున్న చంద్రబాబు, వస్తున్నా.. మీకోసం యాత్ర తొమ్మిదేళ్లు పూర్తి అయిన సందర్భంగా కీలక ప్రకటన
గతంలో తాను చేపట్టిన ‘వస్తున్నా.. మీకోసం’ యాత్రకు తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు.
Amaravati, Oct 3: ఏపీ రాష్ట్రంలో వైసీపీ పరిపాలనను నిరసిస్తూ త్వరలో ఒక ప్రజాయాత్రను చేపట్టబోతున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Prajayatra) ప్రకటించారు. గతంలో తాను చేపట్టిన ‘వస్తున్నా.. మీకోసం’ యాత్రకు తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు. శనివారం హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో పార్టీ నేతల మధ్య ఆయన కేక్ కట్ చేశారు. సరిగ్గా తొమ్మిదేళ్లు కిందట పాదయాత్ర ప్రారంభించిన చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) ఉమ్మడి రాష్ట్రంలో 2,340కి.మీ. నడిచారు.
ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ (TDP) పాలన తర్వాత వచ్చిన ప్రభుత్వాల అవినీతి, అరాచకాలను నిరసిస్తూ హిందూపురం నుంచి పాదయాత్ర ప్రారంభించాను. ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నాను. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడానికి.. వారి కష్టాలు తీర్చడానికి శక్తివంచన లేకుండా పనిచేశాను. కానీ, ఆ ఐదేళ్ల శ్రమ బూడిదలో పోసిన పన్నీరైంది. ఆనాటి పనులన్నింటినీ నాశనం చేసి, విధ్వంస పాలనకు జగన్ శ్రీకారం చుట్టారు. ఈ దుష్ట పాలనతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అభివృద్ధి లేక ఆదాయాలు పడిపోయి విలవిల్లాడుతున్నారు.
దీనిని ప్రజలకు వివరించేందుకు, వారిలో చైతన్యం కలిగించేందుకు త్వరలోనే మనం ప్రజాయాత్ర ప్రారంభించబోతున్నామని చంద్రబాబు తెలిపారు. ఈ అవినీతి ప్రభుత్వంపై పోరాటానికి పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. కాగా, ‘వస్తున్నా.. మీకోసం’ పాదయాత్రలో ‘చంద్ర దండు’ అందించిన సేవలు మరువలేనివని చంద్రబాబు కొనియాడారు.