Telangana: తెలంగాణలో ఘోర విషాదాలు, వనపర్తిలో ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి, పెద్దపల్లి జిల్లాలో మరొకరు మృతి, ఏపీలో రోడ్డు ప్రమాదంలొ మరో ముగ్గురు చిన్నారులు మృతి
సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు శవాలుగా (3 children drown in lake) తేలారు. పట్టణంలో బండార్‌నగర్‌కు చెందిన మున్నా, అజ్మద్, భరత్.. పదో తరగతి చదువుతున్నారు. మంగళవారం సాయంత్రం సరదాగా వనపర్తి శివారులోని చెరువులో ఈతకు వెళ్లి గల్లంతయ్యారు
Wanaparthy, Mar 16; వనపర్తి (wanaparthy) జిల్లా కేంద్రంలో విషాదం ఘటన చోటుచేసుకుంది. సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు శవాలుగా (3 children drown in lake) తేలారు. పట్టణంలో బండార్‌నగర్‌కు చెందిన మున్నా, అజ్మద్, భరత్.. పదో తరగతి చదువుతున్నారు. మంగళవారం సాయంత్రం సరదాగా వనపర్తి శివారులోని చెరువులో ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. దీంతో పోలీసులు వారికోసం గాలింపు చేపట్టారు. బుధవారం ఉదయం గజ ఈతగాళ్ల సాయంతో ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను వనపర్తి జిల్లా దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరో ఘటనలో పెద్దపల్లి జిల్లా పదో తరగతి విద్యార్థి ఈతకు వెళ్లి మరణించాడు. రామగిరి మండలం రత్నాపూర్ పంచాయతీ పరిధి బేగంపేట క్రాస్ రోడ్డుకు చెందిన పదో తరగతి విద్యార్థి తంగళ్లపల్లి విష్ణువర్ధన్ సోమవారం ఈతకు వెళ్లి మృత్యువాతపడగా.. గ్రామస్తులు, కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు.తంగళ్లపల్లి రామచంద్రం, రాజ్యలక్ష్మి దంపతులది స్వగ్రామం లద్నాపూర్ కాగా.. ఆ గ్రామాన్ని సింగరేణి సంస్థ స్వాధీనం చేసుకోవడంతో దాదాపు 20ఏళ్ల క్రితమే జీవనోపాధి నిమిత్తం ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారు.
వీరికి ఇద్దరు కుమారులు. రామచంద్రం మానసికస్థితి సరిగా లేకపోవడంతోపాటు పక్షవాతం బారిన పడ్డాడు. దీంతో రాజ్యలక్ష్మి వ్యవసాయ కూలీగా పనిచేస్తూ ఇద్దరు పిల్లలతోపాటు భర్తను కాపాడుకుంటోంది. మొదటి కుమారుడు కేశవర్ధన్ ఐటీఐ చేస్తున్నాడు. విష్ణువర్ధన్ ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఎస్సారెస్పీ కాలువ నీరు పాఠశాల ఆవరణలోకి చేరడంతో యాజమాన్యం సెలవు ప్రకటించింది. దీంతో తోటి మిత్రులు ఫిరోజ్, శ్రీతరుణ్‌తో కలిసి ఈతకు వెళ్లాడు. ముగ్గురు కాలువలోకి దిగారు. అయితే విష్ణువర్ధన్ నీటిలో అడుగుభాగంలో ఉన్న పూడికలో దిగబడి మునిగిపోయాడు. పాఠశాల యథావిధిగా నిర్వహించి ఉంటే విష్ణువర్ధన్ ఈతకు వెళ్లేవాడే కాదని, సెలవు ఇవ్వడంతోనే సరదా కోసం ఈతకెళ్లి తిరిగి రాని లోకాలు చేరాడని స్థానికులు కంటతడి పెట్టారు.
ఇక ఏపీలోని విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని తెర్లాం మండలం టెక్కలివలస వద్ద ఓ బైకును స్కూల్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.