AP Budget Session 2021-22: నేడు సభ ముందుకు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్, కరోనా దృష్ట్యా కేవలం ఒకరోజు మాత్రమే చర్చ మరియు ఆమోదం, ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన టీడీపీ

2.30 లక్షల కోట్లతో బడ్జెట్‌ను రూపొందించారు. గురువారం ఉదయం 11 గంటల తర్వాత ఈ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు...

File Image of Andhra Pradesh Assembly | ANI Photo

Amaravathi, May 20:  ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్‌ను సమర్పించడానికి ఆంధ్రప్రదేశ్ శాసన సభ నేడు సమావేశం అవుతోంది.

కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని గురువారం ఒక్కరోజే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ ఒక్కరోజులోనే బడ్జెట్‌పై చర్చ జరిపై మరియు ఆమోదం తెలుపుతారు. ముందుగా ఉదయం 8 గంటలకు సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినేట్ సమావేశం అవుతుంది. కేబినేట్ ఆమోదం పొందిన తర్వాత, ఉదయం 9 గంటలకు శాసన సభ సమావేశం ప్రారంభం అవుతుంది. సభను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ వర్చువల్ విధానంలో వీడియో కాన్వరెన్స్ ద్వారా రాజ్ భవన్ నుంచే ప్రసంగించనున్నారు.

2021-22 ఆర్థిక సంవత్సరంలో మొదటి మూడు నెలలకు మార్చి 28న ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్ కోసం ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీంతో మిగిలిన ఏడాదికి బడ్జెట్‌తో పాటు, గత ఆరు నెలల్లో ప్రకటించిన కొన్ని ఇతర ఆర్డినెన్స్‌లను కూడా ప్రభుత్వం చట్ట సభల ద్వారా ఆమోదింపజేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు అసెంబ్లీ సమావేశం అవుతోంది.

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2021-22 ఆర్థిక సంవత్సరానికి సుమారు రూ. 2.30 లక్షల కోట్లతో బడ్జెట్‌ను రూపొందించారు. గురువారం ఉదయం 11 గంటల తర్వాత ఈ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు.

కాగా, జగన్ సర్కార్ 'అప్రజాస్వామిక పాలన'ను నిరసిస్తూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఇక కరోనా విజృంభన నేపథ్యంలో కేవలం 100 మంది సభులు మాత్రమే హాజరు కావాలని సూచించారు. హాజరు తప్పనిసరి అనే నిబంధన లేదు. ఈ క్రమంలో అధికార వైఎస్ఆర్సీపీకి 153 సభ్యుల బలం ఉంది, కాబట్టి ఈ సమావేశాలకు ప్రతిపక్షం అనేది ఉండదు.