Tirumala Update: తిరుమలలో భక్తులకు ఇక వసతి లభ్యత మరింత సులభతరం, జూన్ 12 నుంచి అందుబాటులోకి రానున్న నూతన బుకింగ్ కౌంటర్లు; శ్రీవారిని దర్శించుకున్న సుప్రీం సీజే ఎన్వీ రమణ

అనంతరం గది ఎక్కడ కేటాయించబడిందనే విషయం మొబైల్ కు మెసేజ్ వస్తుంది. దీని తర్వాత నేరుగా ఉప విచారణ కార్యాలయాలకు వెళ్లి...

Tirumala Tirupati Devasthanams | Photo: Twitter

Tirupati/ Tirumala, June 11: శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చే భక్తులకు ఇప్పుడు వసతి లభ్యత మరింత అందుబాటులోకి రానుంది. భక్తుల సౌకర్యార్థం జూన్ 12 నుంచి తిరుమలలోని 6 వేర్వేరు ప్రాంతాలలో నూతనంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల నుంచి వసతి గది కోసం తమ పేర్లు నమోదు చేసుకునే అవకాశాన్ని తితిదే కల్పిస్తోంది.

నూతనంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల వివరాలు.. జిఎన్‌సి టోల్‌గేట్ సమీపంలో లగేజ్ కౌంటర్ వద్ద, బాలాజీ బస్ స్టేషన్ వద్ద రెండు కౌంటర్లు, కౌస్తుభం రెస్ట్ హౌస్ వద్ద, రామ్ భాగీచా రెస్ట్ హౌస్, ఎంబిసి సమీపంలోని శ్రీవారి మెట్టు వద్ద మరియు ప్రస్తుత సిఆర్‌ఓ (సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్) వద్ద కౌంటర్లు తెరిచారు.

శనివారం ఉదయం 8 గంటల నుండి తిరుమలలోని ఈ ఆరు ప్రదేశాల నుంచి వసతి గది కోసం బుకింగ్ చేసుకోవచ్చు. అనంతరం గది ఎక్కడ కేటాయించబడిందనే విషయం మొబైల్ కు మెసేజ్ వస్తుంది. దీని తర్వాత నేరుగా ఉప విచారణ కార్యాలయాలకు వెళ్లి వసతి గృహానికి తగిన అద్దె చెల్లించి గదులు పొందవచ్చు. తిరుమల సందర్శించే భక్తులు వారి కోసం అభివృద్ధి చేసిన కొత్త సౌకర్యాలను గమనించాలని టిటిడి విజ్ఞప్తి చేసింది.

ఇదిలా ఉంటే, సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ ఎన్వీ రమణ తొలిసారిగా సీఎజేఐ హోదాలో శుక్రవారం తిరుమల విచ్చేశారు. ఈరోజు ఉదయం శ్రీవారి అభిషేకసేవలో పాల్గొన్న సీజేఐ రమణ, వీఐపీ బ్రేక్ దర్శనంలో మరోసారి స్వామివారిని దర్శించుకోనున్నారు.