Vijayawada Floods: శాంతించిన బుడమేరు, ప్రకాశం బ్యారేజీకి తగ్గిన వరద, ఊపిరి పీల్చుకున్న బెజవాడ వాసులు, కృష్ణమ్మ ఉగ్రరూపానికి బెంబేలెత్తిన విజయవాడ
నగర ప్రజలకు మూడు రోజులుగా కంటిమీద కునుకు లేకుండా చేశాయి. భారీ వర్షాలు, వరదలతో రెండు రోజులుగా ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ కాస్త శాంతించింది.గత రాత్రి నుంచి ప్రకాశం బ్యారేజి వద్ద వరద ప్రవాహం క్రమ క్రమంగా తగ్గుతూ వస్తోంది.
Vjy, Sep 3: భారీ వరదలు బెజవాడను వణికించాయి. నగర ప్రజలకు మూడు రోజులుగా కంటిమీద కునుకు లేకుండా చేశాయి. భారీ వర్షాలు, వరదలతో రెండు రోజులుగా ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ కాస్త శాంతించింది.గత రాత్రి నుంచి ప్రకాశం బ్యారేజి వద్ద వరద ప్రవాహం క్రమ క్రమంగా తగ్గుతూ వస్తోంది. 11 లక్షల 40 వేల నుంచి గంట గంటకు తగ్గుతూ వరద తాకిడి తగ్గుముఖం పడుతోంది. ఈరోజు (మంగళవారం) ఉదయం 8 లక్షల 94 వేలకు వరద చేరుకుంది.
ప్రవాహం కొనసాగుతోంది. ఈ మధ్యాహ్నానికి నది నీటి మట్టం మరింత తగ్గుతుందని ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు. చరిత్రలో ఇదే రికార్డు స్థాయి నీటి ప్రవాహమని, అయినా ప్రకాశం బ్యారేజీ తట్టుకుని నిలబడిందని చెప్పారు. మరోవైపు బుడమేరు కాస్త శాంతించింది. నిన్నటి వరకు బుడమేరు మహోగ్రరూపం దాల్చించి. బుడమేరు డిజైన్ కెపాసిటీ 15 వేల క్యూసెక్కులకు మించి వదర నీరు వచ్చింది. దీని ఫలితంగా విజయవాడలోని 16 డివిజన్లు నీట మునిగాయి. దాదాపు 2.59 లక్షల మంది నీటిలోనే ఉండిపోయారు. గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో పలు గ్రామాలను వరద ముంపు వెంటాడుతోంది. తెలంగాణను వదలని వర్షాలు.. రానున్న మరో ఐదురోజులు వర్షాలు.. 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్
వరద ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. వరద తగ్గుముఖం పట్టడంతో బెజవాడవాసులు ఊపిరిపీల్చుకుంటున్నారు. మరోవైపు వరద బాధితులకు ఆహారం, తాగునీటి పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ముమ్మరం చేసింది.
తెలంగాణలో కురిసిన భారీవర్షాల ప్రభావంతో సోమవారం మధ్యాహ్నం ఓ దశలో ప్రకాశం బ్యారేజీ వద్ద 11.43 లక్షల క్యూసెక్కుల వరద ముంచెత్తింది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కృష్ణా నదికి ఇరువైపులా లంక గ్రామాలు జలదిగ్బంధంలోకి చేరాయి. అక్కడి ప్రజలను అధికారులు హుటాహుటిన ఖాళీ చేయించి, పునరావాస కేంద్రాలకు తరలించారు. గుంటూరు జిల్లా పరిధిలో 18 లంక గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. విద్యుత్తు సరఫరా స్తంభించింది. మహిళలు, గర్భిణులు, వృద్ధులు సహా వైద్యసాయం అవసరమైన వారిని పడవల్లో తరలించారు. రెండు విద్యుత్తు సబ్‌స్టేషన్లు నీటమునిగాయి.
కరకట్ట లోపల వ్యవసాయ, ఉద్యాన పంటలన్నీ కృష్ణార్పణమయ్యాయి. ఒక్కటీ చేతికొచ్చే పరిస్థితి లేదు. అరటి, కంద, పసుపు, చామ, కూరగాయ పంటలన్నీ నీటమునిగాయి. ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణమ్మ కరకట్ట అంచులను తాకుతూ ప్రవహిస్తోంది. తెనాలి, రేపల్లె నియోజకవర్గాల్లో కరకట్ట బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో మట్టి, ఇసుక బస్తాలు వేసి, ఎత్తు పెంచి నీరు పొర్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పెదపులివర్రు, రావిఅనంతవరం, ఓలేరు ప్రాంతాల్లో గండ్లు పడే ప్రమాదం ఉండటంతో స్థానికులు ఆందోళన చెందారు.
ప్రకాశం బ్యారేజీ నుంచి ఒక్కసారిగా పెద్దఎత్తున నీరు విడుదల కావడంతో రామలింగేశ్వరనగర్, కృష్ణలంక ప్రాంతాల్లోకి వరద పోటెత్తింది. కొన్నిచోట్ల భవనాల మొదటి అంతస్తు వరకు నీళ్లు చేరాయి. గూడవల్లి సమీపంలో బుడమేరు నీళ్లు ఎగదన్నడంతో, పరిసర ప్రాంతాల్లో వరద ముంచెత్తింది. అమరావతి పుణ్యక్షేత్రాన్ని కృష్ణమ్మ చుట్టుముట్టింది. స్నానపు ఘాట్లను ముంచెత్తుతూ పట్టణంలోకి ప్రవేశించింది.
విజయవాడ నుంచి వరంగల్, హైదరాబాద్ వైపు వెళ్లే రైళ్లలో కొన్ని రద్దు చేయగా, మరికొన్నింటిని గుంటూరు, నల్గొండ మీదుగా మళ్లించారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిపివేసి గుంటూరు, పిడుగురాళ్ల మీదుగా మళ్లించారు. విజయవాడ నుంచి ఖమ్మం వైపు వెళ్లే బస్సులను నిలిపేశారు. వరద కారణంగా విజయవాడ నగరంలో సిటీ బస్సులు పరిమితంగానే తిరిగాయి.
బుడమేరు ఉద్ధృతికి నీట మునిగిన సింగ్‌నగర్ ప్రాంతంలో వరద కష్టాలు కొనసాగుతున్నాయి. ఐదారు అడుగుల ఎత్తున నీరు నిలవడంతో స్థానికులు బయటకు రాలేకపోయారు. పడవలు ఏర్పాటు చేసి కొందరిని పునరావాస కేంద్రాలకు తరలించినా, అధికశాతం మంది ఇంకా పై అంతస్తుల్లో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ప్రధాన రహదారుల వెంబడి ఉన్నవారికి ఆహారం, తాగునీరు అందుతున్నా, లోపలి ప్రాంతాల్లోని వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయటకు రావాలంటే పడవలు కూడా లేవు. విద్యుత్తు లేదు. తాగునీరు నిండుకుందని వాపోతున్నారు.
బాధితుల్లో ఎక్కువ మందికి సురక్షితంగా ఆహారాన్ని అందించేందుకు డ్రోన్లను వినియోగించారు. మునిగిన ప్రాంతాలు, బహుళ అంతస్తుల భవనాలపైకి డ్రోన్ల ద్వారా ఆహార పొట్లాలు పంపించారు.