Vijayawada Woman Murder Case: విజయవాడ యువతిని చంపి యూపీలో యమునా నదిలో పడేసిన ప్రియుడు, సంచలనం రేపిన ఫాతిమా హత్య కేసులో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి, నిందితులను అరెస్ట్ చేసిన కొత్తపేట పోలీసులు
ప్రేమించిన వాడితో జీవితం పంచుకోవాలని ఇంటి నుంచి వెళ్లిపోయిన యువతిని ప్రియుడు అతని స్నేహితునితో కలిసి యూపీలో దారుణంగా హత్య చేశాడు.
Amaravati, August 10: ఇటీవల సంచలనం రేపిన ఫాతిమా హత్య కేసులో (Vijayawada Woman Murder Case) దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది.ఎట్టకేలకు విజయవాడకు చెందిన యువతి అదృశ్యం కేసును కొత్తపేట పోలీసులు ఛేదించారు. ప్రేమించిన వాడితో జీవితం పంచుకోవాలని ఇంటి నుంచి వెళ్లిపోయిన యువతిని ప్రియుడు అతని స్నేహితునితో కలిసి యూపీలో దారుణంగా హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని సహరంపూర్ కోర్టు అనుమతితో ఏపీ పోలీసులు ఇద్దరు నిందితులు (two accused held in Uttar Pradesh) వాసిమ్, తయ్యబ్‌లను విజయవాడకు తీసుకొచ్చారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తస్లిమా ఫాతిమా అనే యువతి.. స్థానికంగా ఉంటున్న ఓ యువకుడిని ప్రేమించింది. కొద్దిరోజుల క్రితం ప్రియుడు తన స్వస్థలమైన ఉత్తర్‌ప్రదేశ్ వెళ్లిపోయాడు. ప్రియుడు రమ్మని చెప్పడంతో గత నెల పదో తేదీన ఫాతిమా విజయవాడలోని ఇంటి నుంచి వెళ్లిపోయింది. కుమార్తె ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు స్థానిక కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అదృశ్యం కేసుగా (woman's missing case) నమోదు చేసి విచారణ చేపట్టారు. ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు.. సదరు యువతి ఉత్తర్‌ప్రదేశ్‌లోని యమునా నదీ తీరంలో మృతిచెందినట్లు గుర్తించారు.
తొలుత నిందితులు దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించాలనే ప్రయత్నం చేసినప్పటికీ యూపీ పోలీసులు వివరాలు సేకరించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అప్పటికే కొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌లో అదృశ్యం కేసు నమోదై ఉండటంతో.. సమాచారం అందుకున్న విజయవాడ పోలీసులు యూపీ వెళ్లి విచారణ చేపట్టారు. యువతి యూపీ వెళ్లాక ప్రియుడు, మరో వ్యక్తి కలిసి ఆమె వద్ద నుంచి నగదు, బంగారం కాజేసి హతమార్చి యమునా నదిలోకి తోసేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. అనంతరం నిందితులను గుర్తించి రైల్లో విజయవాడ తీసుకొచ్చారు. మంగళవారం వారిని కోర్టులో హాజరు పరచనున్నారు.అయితే ఫాతిమాను వాసిమ్, తయ్యబ్‌లే హత్య చేశారా?.. ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసుల విచారణ చేపడుతున్నారు. నిందితులను పూర్తి స్థాయిలో విచారించనున్నారు.