Vivekananda Reddy Murder Case: వివేకా హత్య కేసులో కీలక మలుపు, ఈ నెల 24 వరకు అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేయొద్దని సీబీఐకి సుప్రీం ఆదేశాలు, విచారణ సోమవారానికి వాయిదా
ఈ సందర్భంగా ఈ నెల 24 వరకు అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేయొద్దని సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
Hyd, April 21: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వివేకా కుమార్తె సునీత పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఈ నెల 24 వరకు అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేయొద్దని సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24న ఉదయం 9.30కి కేసు వివరాలు వింటామని సుప్రీంకోర్టు తెలిపింది. తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇస్తే సీబీఐ అరెస్ట్ చేస్తుందని అవినాష్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. తదుపరి విచారణను ధర్మాసనం సోమవారానికి వాయిదా వేసింది.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో.. సీబీఐపై ఎటువంటి ఆంక్షలూ లేకుండా స్వేచ్ఛగా దర్యాప్తు చేయనివ్వాలంటూ సుప్రీంకోర్టులో ఆయన కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సునీత తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూద్రా వాదనలు వినిపించారు.
హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తే అవినాశ్ ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేస్తారంటూ ధర్మాసనం దృష్టికి అవినాశ్ రెడ్డి తరపు న్యాయవాది తీసుకెళ్లారు. అంతేకాదు, ఈ కేసుకు సంబంధించి పేపర్ బుక్ కూడా తమ వద్ద లేదని... సునీత పిటిషన్ లో ఏముందో కూడా తమకు తెలియదని... పేపర్ బుక్ తమ వద్ద ఉంటే ఇప్పుడే వాదనలు వినిపించేవాళ్లమని చెప్పారు. సోమవారం వరకు విచారణను వాయిదా వేశారు కాబట్టి, సోమవారం తమ వాదనలను వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో, సోమవారం వరకు అవినాశ్ ను అరెస్ట్ చేయవద్దని సుప్రీం ఆదేశించింది. ఈ కేసులో ప్రతివాది అయిన అవినాశ్ కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.